Budget 2026 : ఈవీ బ్యాటరీలపై ట్యాక్స్ తగ్గింపు? బడ్జెట్ నుంచి ఆటోమొబైల్ రంగం ఆశిస్తున్నది ఇదే.

Budget 2026 : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై ఎలక్ట్రిక్ వాహనాల రంగం గంపెడాశలు పెట్టుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు నుంచి ఉపశమనం పొందాలంటే ఈవీలే మార్గమని భావిస్తున్న సామాన్యుడికి, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చే రాయితీలే కీలకం కానున్నాయి. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తున్న మోదీ సర్కార్, ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలకు బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
బడ్జెట్ 2026లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ప్రధానంగా పీఎల్ఐ (Production Linked Incentive) పథకంలో మార్పులను కోరుతోంది. ప్రస్తుతం ఈ పథకం కింద అందుతున్న ప్రయోజనాలు కేవలం దిగ్గజ సంస్థలకే పరిమితమవుతున్నాయని, స్టార్టప్‌లు, చిన్న విడిభాగాల తయారీదారులకు కూడా ఇవి వర్తించేలా నిబంధనలు సడలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల దేశీయంగా మోటార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు బ్యాటరీల తయారీ పెరిగి, వాహనాల తయారీ వ్యయం తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి.
మరో కీలక అంశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా, భారత్ లోనే అత్యాధునిక ఈవీ టెక్నాలజీని అభివృద్ధి చేసే కంపెనీలకు పన్ను రాయితీలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. చైనా వంటి దేశాల నుంచి బ్యాటరీ విడిభాగాల దిగుమతి తగ్గాలంటే, లోకల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కు భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మినహా మరో మార్గం లేదు. ప్రభుత్వం గనక ఈ రంగంలో ఇన్నోవేషన్ కు నిధులు కేటాయిస్తే, భారత ఈవీ మార్కెట్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది.
పన్నుల విషయంలో కూడా భారీ ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఈవీ వాహనాలపై 5 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ, వాటి తయారీకి వాడే స్పేర్ పార్ట్స్ పై పన్ను ఎక్కువగా ఉండటం వల్ల ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్య తలెత్తుతోంది. దీనివల్ల కంపెనీల పెట్టుబడి వ్యయం పెరిగి, ఆ భారం కస్టమర్ల మీద పడుతోంది. ఈ బడ్జెట్‌లో విడిభాగాలపై పన్నులు తగ్గించి, ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇస్తే కారు ధరలు కనీసం రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఇచ్చే రాయితీలు పెరిగితే, ప్రజల్లో ఈవీల పట్ల ఉన్న భయం తొలగిపోతుంది.
మొత్తానికి బడ్జెట్ 2026 అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాకుండా, దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచిగా మారనుంది. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఈవీ రంగానికి ప్రాధాన్యత ఇస్తే, రాబోయే ఐదేళ్లలో రోడ్ల మీద పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా కనిపిస్తాయనడంలో సందేహం లేదు. క్లీన్ ఎయిర్, సేఫ్ డ్రైవ్, తక్కువ ఖర్చు అనే సూత్రంతో ప్రభుత్వం ఈసారి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
