PETROL: భారత్‌లోనూ పెట్రోల్ ధర పెరుగుతుందా. ?

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణా వ్యవస్థకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా జోక్యం కారణంగా ప్రాంతీయ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సరఫరా మార్గాల్లో అంతరాయం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై పడే అవకాశముండటంతో ప్రజల్లో ఇంధన ధరలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు స్పష్టత ఇవ్వడంతో కొంతవరకు ప్రజలు ఊరట పొందుతున్నారు. ఇటీవల ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు రవాణాలో పెద్ద ఆటంకం ఏర్పడింది. ప్రపంచంలో రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే ప్రయాణిస్తుంది. ఈ మార్గం మూసివేయడం వల్ల నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
ఈ పరిస్థితులు కొనసాగితే చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ కూడా తన అవసరాలకు పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ఈ పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడుతుందేమోనన్న భయం ప్రజల్లో కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు ముందుగానే ఇంధనం నిల్వ చేసుకునేందుకు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి. మార్చి 6న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. ప్రస్తుతం దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అందువల్ల అపోహలు నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని ప్రజలను కోరాయి. ఇంధన ధరలపై ఆందోళనలు పెరగడానికి మరో కారణం ఇటీవల వంట గ్యాస్ ధరల పెరుగుదల. దాదాపు 11 నెలల తర్వాత గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 60 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 905 నుంచి రూ. 965 కు పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
