Verge Motorcycles : ప్రపంచంలోనే తొలిసారి.. ఈ బైక్ బ్యాటరీ ఒక అద్భుతం..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిమీ.

Verge Motorcycles : ఎలక్ట్రిక్ బైక్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రేంజ్ భయం, ఛార్జింగ్ సమయం. ఈ రెండింటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తోంది ఫిన్లాండ్ కంపెనీ వెర్జ్. టెక్నాలజీ కంపెనీ డోనట్ ల్యాబ్తో కలిసి వారు రూపొందించిన ఈ బైక్, త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీలకు బదులుగా సాలిడ్-స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని వాడారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ బైక్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
సాధారణంగా మనం వాడే ఈవీ బ్యాటరీలలో లిక్విడ్ లేదా జెల్ లాంటి పదార్థం ఉంటుంది. కానీ సాలిడ్-స్టేట్ బ్యాటరీలో ఘన పదార్థాన్ని వాడుతారు. దీనివల్ల బ్యాటరీ పరిమాణం తగ్గినా, పవర్ మాత్రం రెట్టింపు అవుతుంది. కార్ల కంపెనీలు కూడా ఇంకా ప్రయోగాలు చేస్తున్న ఈ టెక్నాలజీని, వెర్జ్ కంపెనీ నేరుగా ప్రొడక్షన్ బైక్‌లో వాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది లిథియం బ్యాటరీల కంటే ఎక్కువ కాలం మన్నుతుంది మరియు చాలా సురక్షితం.
ఈ బైక్ పనితీరు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఇక ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల (370 మైళ్ళు) రేంజ్ ఇస్తుంది. వేగం విషయంలోనూ ఇది తక్కువ కాదు.. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.5 సెకన్లలోనే అందుకుంటుంది. అంటే సూపర్ కార్లతో పోటీ పడే వేగం దీని సొంతం. లాంగ్ రైడ్స్ వెళ్లాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
లిథియం బ్యాటరీలలో అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ సాలిడ్-స్టేట్ బ్యాటరీలలో ఆ భయం లేదు. ఇవి ఎక్కువ స్థిరంగా ఉంటాయి. విపరీతమైన ఎండల్లో లేదా గడ్డకట్టే చలిలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పర్యావరణానికి కూడా ఇవి తక్కువ హాని చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీ తయారీకి వాడే ముడి పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా సులభంగా దొరుకుతాయి కాబట్టి, భవిష్యత్తులో వీటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

