UPI : తప్పుడు అకౌంట్ కి డబ్బులు వెళ్ళాయా? మీ డబ్బులు వెనక్కి వచ్చే రూట్ మ్యాప్ ఇదే!

UPI : నేటి డిజిటల్ యుగంలో ఫోన్ ద్వారా డబ్బులు పంపడం చాలా సులభమైపోయింది. ఒక్క క్లిక్‌తో సెకన్లలో వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. అయితే, ఇదే వేగం ఒక్కోసారి కొంపముంచుతుంది. తొందరలోనో లేదా పొరపాటున ఒక అంకె తప్పు కొట్టడం వల్లనో మనం పంపాల్సిన డబ్బులు ఎవరో తెలియని వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోతుంటాయి. అలా జరిగినప్పుడు గుండె ఆగినంత పని అవుతుంది. కానీ, కంగారు పడొద్దు. మీరు సరైన సమయంలో స్పందిస్తే, పొరపాటున వేరే అకౌంట్‌కు పంపిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. అదెలాగో వివరంగా తెలుసుకుందాం.
మీరు పొరపాటున డబ్బులు పంపినట్లు గుర్తించిన వెంటనే, మీ యూపీఐ యాప్ (PhonePe, Google Pay, Paytm) లోని ట్రాన్సాక్షన్ హిస్టరీని ఓపెన్ చేయండి. అక్కడ ప్రతి లావాదేవీకి ఒక UTR నంబర్ (Unique Transaction Reference) ఉంటుంది. ఈ నంబర్ చాలా ముఖ్యం. దీన్ని నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్ తీయండి. మీ ఫిర్యాదు ప్రక్రియ అంతా ఈ నంబర్ ఆధారంగానే జరుగుతుంది.
డబ్బులు కట్ అయిన వెంటనే మీరు వాడుతున్న యూపీఐ యాప్‌లోనే Help లేదా Support సెక్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. అక్కడ Sent money to wrong person అనే ఆప్షన్ ఎంచుకుని వివరాలు సమర్పించండి. దీనివల్ల ఆ లావాదేవీపై అధికారికంగా దర్యాప్తు మొదలవుతుంది. అయితే కేవలం యాప్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోదు, వెంటనే మీ బ్యాంకును కూడా సంప్రదించాలి.
డబ్బులు పంపిన 48 గంటల లోపు మీ బ్యాంకుకు సమాచారం అందించడం చాలా ముఖ్యం. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయండి లేదా నేరుగా మీ బ్రాంచ్‌కు వెళ్లి మేనేజర్‌ను కలవండి. మీరు పంపిన UTR నంబర్ ఇచ్చి వివరాలు చెబితే, మీ బ్యాంకు వారు అవతలి వ్యక్తి అకౌంట్ ఉన్న బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతారు. అవతలి వ్యక్తి అంగీకరిస్తే మీ డబ్బులు తిరిగి మీ ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ బ్యాంకు స్పందించకపోతే, మీరు ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వద్ద ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
యూపీఐ లావాదేవీలన్నీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పర్యవేక్షణలో జరుగుతాయి. ఒకవేళ మీ సమస్య పరిష్కారం కాకపోతే, NPCI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి Dispute Redressal Mechanismలో మీ ఫిర్యాదును నమోదు చేయండి. అక్కడ ట్రాన్సాక్షన్ టైప్, ఇష్యూ వంటి వివరాలు ఇచ్చి UTR నంబర్‌ను జత చేయాలి. ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ విషయంలో కస్టమర్లకు రక్షణ కల్పిస్తోంది కాబట్టి భయపడాల్సిన పని లేదు.
డబ్బులు పోయిన తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మేలు. ఎవరికైనా డబ్బులు పంపే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. కొత్త వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు, ముందుగా ఒక రూపాయి పంపి కన్ఫర్మ్ చేసుకోండి. వీలైనంత వరకు మాన్యువల్‌గా యూపీఐ ఐడీ టైప్ చేయకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీ పిన్ ఎంటర్ చేసే ముందు ఒక్క క్షణం ఆగి అన్ని వివరాలు సరిచూసుకోవడం అలవాటు చేసుకోండి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

