Yamaha : బ్రేకుల్లో సమస్య.. భారీగా స్కూటర్లను వెనక్కి పిలుస్తున్న యమహా..మీ బండి ఉందో లేదో చెక్ చేసుకోండి.

Yamaha : ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా, తన పాపులర్ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా RayZR 125 Fi Hybrid, Fascino 125 Fi Hybrid మోడల్స్ ఉన్నాయి. ఈ రీకాల్ పరిధిలోకి మే 2, 2024 నుంచి సెప్టెంబర్ 3, 2025 మధ్య తయారైన వాహనాలు వస్తాయి. మొత్తం 3,06,635 స్కూటర్లలో సాంకేతిక లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీనిని వాలంటరీ రీకాల్ గా కంపెనీ పేర్కొంది. అంటే ప్రభుత్వం ఆదేశించకముందే, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీయే ఈ బాధ్యత తీసుకుంది.
అసలు సమస్య ఏంటి?
రీకాల్ నోటీసు ప్రకారం ఈ స్కూటర్లలోని ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లో సమస్య ఉన్నట్లు తెలిసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవచ్చు లేదా పనితీరులో తేడాలు రావచ్చు. ప్రతి వాహనంలోనూ ఈ సమస్య ఉండకపోవచ్చు, కానీ భద్రత విషయంలో రిస్క్ తీసుకోకూడదని యమహా నిర్ణయించుకుంది. లోపం ఉన్న వాహనాలను సర్వీస్ సెంటర్లలో క్షుణ్ణంగా తనిఖీ చేసి, అవసరమైతే ఆ పార్ట్‌ను ఉచితంగా మార్చి ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. దీని కోసం కస్టమర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
మీ స్కూటర్ ఉందో లేదో ఇలా తెలుసుకోండి
మీ దగ్గర ఉన్న యమహా స్కూటర్ ఈ రీకాల్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం.
* ముందుగా యమహా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* అక్కడ ఉన్న Voluntary Recall Campaign పేజీకి వెళ్లండి.
* మీ స్కూటర్ Chassis Number ఎంటర్ చేసి సర్చ్ చేయండి.
ఒకవేళ మీ వాహనం రీకాల్ పరిధిలో ఉంటే, వెంటనే మీకు సమీపంలోని యమహా షోరూమ్‌ను సంప్రదించమని చూపిస్తుంది. దీనితో పాటు, కంపెనీ తన టోల్-ఫ్రీ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా కస్టమర్లకు సహాయం అందిస్తోంది. సర్వీస్ సెంటర్‌కు వెళ్లే ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవడం వల్ల వేచి ఉండాల్సిన అవసరం ఉండదని కంపెనీ సూచిస్తోంది.
ఫీచర్లు, ధరలు
యమహాకు చెందిన ఈ హైబ్రిడ్ స్కూటర్లు మార్కెట్లో చాలా ఫేమస్. వీటిలో 125సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.2 PS పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్ బ్యాటరీని ఛార్జ్ చేయడమే కాకుండా, అదనపు టార్క్‌ను అందిస్తూ బండికి పికప్ ఇస్తుంది. వీటిలో వై-కనెక్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. ధరల విషయానికి వస్తే, RayZR 125 డిస్క్ వేరియంట్ ధర రూ.80,900 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుండగా, ఫాసినో 125 డిస్క్ వేరియంట్ ధర రూ.87,100 గా ఉంది.
ప్రస్తుతం వాహన రంగంలో నాణ్యత ప్రమాణాల విషయంలో కంపెనీలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. లోపాలు బయటపడినప్పుడు వెంటనే సరిచేయడం వల్ల బ్రాండ్ పై నమ్మకం పెరుగుతుందని యమహా భావిస్తోంది. కాబట్టి, పైన పేర్కొన్న తేదీల మధ్య స్కూటర్ కొన్నవారు ఆలస్యం చేయకుండా తమ వాహనాన్ని తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
