Zoho Founder Sridhar Vembu : జోహో బాస్‌కు అమెరికా కోర్టు షాక్.. విడాకుల కోసం 15 వేల కోట్లు కట్టాల్సిందేనా?

Zoho Founder Sridhar Vembu : జోహో బాస్‌కు అమెరికా కోర్టు షాక్.. విడాకుల కోసం 15 వేల కోట్లు కట్టాల్సిందేనా?
X

Zoho Founder Sridhar Vembu : ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సేవలు అందించే ప్రముఖ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబూ విడాకుల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని సుపీరియర్ కోర్టు ఆయనకు ఒక భారీ షాక్ ఇచ్చింది. తన భార్య ప్రమీల శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, విడాకుల ప్రక్రియ ముగిసే వరకు సెక్యూరిటీగా 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) విలువైన బాండ్లను జమ చేయాలని ఆదేశించింది.

శ్రీధర్ వెంబూ భార్య ప్రమీల శ్రీనివాసన్ కోర్టులో తీవ్రమైన ఆరోపణలు చేశారు. జోహో సంస్థను తామిద్దరూ కలిసి నిర్మించామని, కానీ శ్రీధర్ తన షేర్లను రహస్యంగా తన సోదరులు మరియు సన్నిహితులకు బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. మూడు విడతలుగా ఈ ఆస్తుల బదిలీ జరిగిందని, తన ప్రయోజనాలకు భంగం కలిగించేలా శ్రీధర్ వ్యవహరించారని ఆమె వాదించారు. తాను తన ఉద్యోగాన్ని వదిలి మరీ శ్రీధర్ బిజినెస్ సెటిల్ అయ్యే వరకు సహకరించానని, తీరా విడాకుల సమయానికి కంపెనీలో తనకు కేవలం 5 శాతం మాత్రమే వాటా ఉందని ఆయన అబద్ధం చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జనవరి 2025లో ఈ కేసుపై విచారణ జరిపిన కాలిఫోర్నియా కోర్టు, ప్రాథమికంగా శ్రీధర్ వెంబూ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. భార్య ప్రయోజనాలను దెబ్బతీసేలా జోహో కార్పొరేషన్, సంబంధిత సంస్థల నిర్మాణాన్ని మార్చారని కోర్టు పేర్కొంది. అందుకే ఆస్తుల పంపిణీ సజావుగా జరిగే వరకు 15 వేల కోట్ల బాండ్ సమర్పించాలని, అలాగే సంస్థ కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఒక రిసీవర్‎ను నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీలో పెద్ద ఎత్తున మార్పులు చేయవద్దని కూడా స్టే విధించింది.

అయితే ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబూ తోసిపుచ్చారు. జోహో కో-ఫౌండర్, సీఈఓగా ఉన్నప్పటికీ, తన వాటా ఎప్పుడూ 5 శాతమేనని ఆయన వాదిస్తున్నారు. మిగిలిన 80 శాతం పైగా షేర్లు తన తోబుట్టువుల వద్దే ఉన్నాయని చెబుతున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వెంబూ , ఆయన సోదరుల మొత్తం ఆస్తి విలువ 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50,000 కోట్లు). 30 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021లో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆటిజం పరిశోధనల కోసం ప్రమీల శ్రీనివాసన్ ది బ్రెయిన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు.

ఒకవేళ కోర్టు ఆదేశించినట్లుగా ఆస్తుల పంపిణీ జరిగితే, ఇది భారతీయ పారిశ్రామికవేత్తల చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా నిలిచిపోతుంది.

Tags

Next Story