LPG Crisis : జొమాటో, స్విగ్గీలకు గ్యాస్ సెగ.. యుద్ధం దెబ్బకు 60 శాతం పడిపోయిన ఆర్డర్లు.

LPG Crisis : పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన దేశంలోని ఫుడ్ డెలివరీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న పోరు వల్ల ఎల్‌పీజీ సరఫరాకు తీవ్ర విఘాతం కలగడంతో, భారత్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత ముదిరింది. దీని ప్రభావం ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన జొమాటో, స్విగ్గీలపై గట్టిగా పడింది. రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌లు గ్యాస్ లేక వంటలు చేయలేక మూతపడుతుండటంతో ఆర్డర్లు భారీగా పడిపోయాయి. ఒకప్పుడు నిరంతరం ఆర్డర్లతో కళకళలాడిన ఈ యాప్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
ఈ గ్యాస్ సంక్షోభం భారత ఫుడ్ అండ్ బెవరేజ్ రంగానికి పెను దెబ్బగా మారింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై ట్రేడింగ్‌లో జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ లిమిటెడ్ షేర్లు సుమారు 4.8% పతనమవగా, స్విగ్గీ షేర్లు తమ కనిష్ట స్థాయికి పడిపోయాయి. డొమినోస్ పిజ్జాను నడిపే జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ సెగతో నష్టాలను చవిచూస్తున్నాయి. వ్యాపారం 50 నుంచి 60 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయి షేర్లను విక్రయిస్తున్నారు.
మరోవైపు, డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. గిగ్ వర్కర్ల యూనియన్ సమాచారం ప్రకారం.. గతంలో రోజుకు 30 ఆర్డర్లు పూర్తి చేసే డెలివరీ వర్కర్లకు ఇప్పుడు కేవలం 5 నుంచి 10 ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. ఆదాయం భారీగా తగ్గిపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడం, లభ్యత తగ్గడంతో చిన్న చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు కూడా పనులు ఆపివేస్తున్నాయి. గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్ అవుతుంటే, డెలివరీ చేసేందుకు ఏమీ లేక గిగ్ వర్కర్లు ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.
భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో సగానికి పైగా పశ్చిమాసియా నుండే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో గ్యాస్ ట్యాంకర్లు మన ఓడరేవులకు చేరుకోలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాల్లో సగం రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, కమర్షియల్ రంగంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది.
సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (1955)ను ప్రయోగించింది. గృహ వినియోగదారులకు గ్యాస్ అందేలా చూస్తున్నప్పటికీ, ధరల పెరుగుదల సామాన్యుడిని వేధిస్తోంది. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ ధర 7 శాతం పెరిగి రూ.913కి చేరింది. ఏడాది కాలంలో ఇదే అతిపెద్ద పెరుగుదల. మరోవైపు కమర్షియల్ గ్యాస్ ధరలను కూడా ఈ నెలలోనే రెండోసారి పెంచారు. వెరసి, యుద్ధం ముగిసే వరకు ఫుడ్ ఆర్డర్ల ప్రియులకు, ఆ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మందికి కష్టాలు తప్పేలా లేవు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
