Actor Ajith : నటుడు అజిత్ హెల్త్ బులెటిన్ విడుదల

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ స్వల్ప గాయంతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా జరిగిన తోపులాటలో ఆయన కాలికి గాయమైంది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అజిత్ బృందం స్పష్టం చేసింది. పద్మభూషణ్ పురస్కార స్వీకరణ కార్యక్రమం అనంతరం అజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. అజిత్‌ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అజిత్ కాలికి స్వల్ప గాయమైనట్టు సమాచారం.
అజిత్‌ను చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను పరీక్షించి, కాలికి అయిన గాయం స్వల్పమైనదేనని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని ధృవీకరించినట్లు అజిత్ బృందం జాతీయ మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ఈ రోజు సాయంత్రానికి నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అజిత్ ఆరోగ్యం గురించి అభిమానులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన టీమ్ కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com