Tollywood Piracy : పైరసీపై మరో యుద్ధం తప్పదు

పైరసీ భూతాన్ని తరమండి.. ఇండస్ట్రీని కాపాడండి అంటూ ఓ దశాబ్దం క్రితం అన్ని భాషల హీరోలంతా ముక్త కంఠంతో చెప్పిన వీడియోస్ చాలామంది చూసే ఉంటారు. ఆ రోజుల్లో పైరసీ అనే ఇండస్ట్రీని శాసించింది అంటే అతిశయోక్తి కాదు. ఆ నేపథ్యంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి పైరసీ అనే మాటకు పరిశ్రమలు ఎలా వణికిపోయాయో అరథం చేసుకోవచ్చు. అప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది. చాలా వేగంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంటే తప్ప థియేటర్స్ లో కాస్త ఎక్కువ రోజులు కనిపించడం లేదు సినిమాలు. ఎక్కువ రోజులు అంటే నెలల తరబడేం కాదు.. కానీ రెండు మూడు వారాలు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి కనిపించిన పైరసీ అనేది ఖచ్చితంగా ఓ మాఫియా అనే చెప్పాలి. కాకపోతే ఇది బయటి నుంచి జరిగేది కాదు. ఇండస్ట్రీ నుంచే జరుగుతున్నదని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.
ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకుంటే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. గేమ్ ఛేంజర్ కు సంబంధించి టాలీవుడ్ కే చెందిన ఇద్దరు స్టార్ హీరో అభిమానులు అక్యూజ్డ్ గా ఉన్నారు. అంటే వీళ్లకు వాళ్లు డామేజ్ చేస్తే వారికి వీరు డ్యామేజ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇండస్ట్రీ నాశనం అవుతుంది. అందుకే అటు హీరోల అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా కొంత బాధ్యతాయుతమైన మనుషులతో కూడిన ఓ పాలసీ తీసుకురావడం అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి హీరో ప్యాన్ ఇండియా సినిమా అంటున్నాడు. అంటే భారీ బడ్జెట్ తోనే ఉంటాయి. అలాంటి మూవీస్ రిలీజ్ రోజునే ఆన్ లైన్ లో ప్రత్యక్ష్యం అయితే థియేటర్స్ వరకూ ఎవరొస్తారు. పైగా ఇవన్నీ హెచ్.డి క్వాలిటీతో కనిపిస్తున్నాయి. సో.. మాగ్జిమం థియేటర్స్ వ్యవస్థ కూడా నాశనం అవుతుంది.
మరోవైపు ఫస్ట్ వీక్ లో టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. ఇలా ఆన్ లైన్ మూవీస్ కోసమో.. అడ్డదారుల్లో వచ్చే సినిమాల కోసమో చూసే ప్రేక్షకులూ పెరుగుతున్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీ నుంచే సపోర్ట్ వస్తోంటే ఇంక వాళ్లెందుకు థియేటర్స్ కు వస్తారు. సింపుల్ గా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అతనికి రైవల్రీగా ఉన్న వేరే హీరో ఫ్యాన్స్ పేజ్ లను సెర్చ్ చేస్తే ఆ మూవీస్ ఆన్ లైన్ లోనే కనిపిస్తాయి. అందుకే అభిమానం పేరుతో వెర్రితలలు వేస్తోన్న ఇలాంటి విష సంస్కృతికి చెక్ పెట్టాలి. సినిమా బావుంటే ఆడుతుంది లేదంటే లేదు. బట్ ఇలా కంటెంట్ తో సంబంధం లేకుండా కక్ష పూరితంగా లీక్ లు చేయడం ద్వారా వందల కోట్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు నిండా మునుగుతారు. నిర్మాత మునగడం అంటే ఇండస్ట్రీయే ఇబ్బందుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే ఇలాంటి ఇంటిదొంగల భరతం పట్టాలి. అలాగే లేటెస్ట్ వెర్షన్ పైరసీపై మరో యుద్ధానికి అంతా సిద్ధం కావాలి. ఓ స్ట్రాంగ్ పాలసీని తీసుకురావాలి. లేదంటే రేపు ప్రభాస్ సినిమా అయినా.. చిరంజీవి సినిమా అయినా మొదటి రోజే లీక్ అవుతుంది. ఆడియన్స్ ఇంట్లోనే ఆన్ లైన్ లో చూసేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com