Bellamkonda Srinivas : పవర్ ఫుల్ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Srinivas :  పవర్ ఫుల్ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్
X

రాక్షసుడు తర్వాత సరైన హిట్ లేని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ మధ్య ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి ఇమేజ్ కాల్చుకున్నాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో వరుసగా సినిమాలు ప్రారంభం అయ్యాయి. టైసన్ నాయుడు త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఆశ్చర్యంగా దీనికంటే చాలా ఆలస్యంగా మొదలైన మరో సినిమా వేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది. పైగా ఇది మల్టీస్టారర్ కూడా కావడం విశేషం.

తమిళ్ లో ఈ యేడాది విడుదలై కమర్షియల్ గానూ, విమర్శకుల నుంచీ ప్రశంసలు పొందిన సినిమా గరుడన్. సూరి, శశికుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెట్రిమారన్ అందించిన కథతో దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమానే తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికే పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేశారు.

‘‘భైరవం’’.. ఇదీ ఈ మూవీ టైటిల్. అయితే శ్రీనివాస్ ఫోటో మాత్రమే టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వేశారు. ఓ పెద్ద గుడి ముందు ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో పెద్ద కత్తి లాంటి ఆయుధాలతో రక్తం కారుతున్న దేహం, రౌద్రంతో కూడిన చూపుతో శ్రీనివాస్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాడీ పోస్టర్ లో.

ఇక ఈ మూవీ మూల కథలో అనేక లేయర్స్ ఉంటాయి. స్నేహం, వంచన, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్, ముగ్గురు స్నేహితుల మధ్య విభేదాలు.. ఇలా చాలా అంశాలే ఉన్నాయి. మరి వీటిని తెలుగులో అలాగే తీశారా లేక మార్పులేమైనా చేశారా అనేది తెలియదు కానీ ఇంతకు ముందు నాంది, ఉగ్రమ్ సినిమాలతో మెప్పించిన విజయ్ కనకమేడల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కేకే రాధామోహన్ నిర్మాత. శ్రీ చరణ్ పాకాల సంగీతం చేస్తున్నాడు. మొత్తంగా పవర్ ఫుల్ టైటిల్ తో వస్తోన్న ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

Tags

Next Story