Supreme Court : సుప్రీంలో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

Supreme Court : సుప్రీంలో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
X

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తిరుపతిలో ఆయనకు విద్యా సంస్థలు నడుపుతున్న విషయం తెలిసిందే. తమ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులకు అందే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఆయన గతంలో ధర్నాకు దిగారు. 2019 మార్చి 22 న జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన కొడుకులు మంచు విష్ణు, మనోజ్ కూడా పాల్గొన్నారు. ఐతే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో తండ్రి ,కొడుకులపై కేసు నమోదు అయింది.

ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ సిబ్బంది నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టగా.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించడంతో పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తమపై నమోదైన కేసును రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ హైకోర్టు మోహన్ బాబు అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ క్రమంలో ఆయన ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం మోహన్ బాబు, ఆయన కుమారుల పై పెట్టిన కేసును కొట్టి వేసింది. 2019 మార్చి 23 న ఈ కేసు నమోదు కాగా.. దాదాపు ఆరేళ్ల తర్వాత మోహన్ బాబు కు ఊరట లభించింది. కాగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్‌, ఛార్జ్‌షీట్ల‌ను క‌లిపి చ‌దివిన ధర్మాసనం అందులో పేర్కొన్న సెక్ష‌న్లు వీరికి ఎలా వ‌ర్తిస్తాయో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించింది.

Tags

Next Story