Nayanthara : నయనతార రూ.వంద కోట్ల సినిమా వదులుకుందా?

ప్రపంచంలో డబ్బుకే ప్రాముఖ్యత ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి భారీ ఆఫర్ ను సైతం తిరస్కరించే సందర్భాలు ఎదురవుతాయి. దక్షిణాదిలో క్రేజ్ ఉన్న నాయికల్లో నయనతార ఒకరు. ఆమె వ్యక్తిగత జీవితంలో అలజడి ఉన్నప్పటికీ, దాని ప్రభావం కెరీర్ పై పడలేదు. కారణం ఎంపిక చేసుకుంటున్న సినిమాలే. అందుకే అత్యధిక పారితోషికం తీసుకునే నాయికల్లో ఒకరిగా నిలిచింది. నయనతార ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. సినిమా ఏదైనప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని భావించే ఇటీవల ఓ సినిమాను నిరాకరించింది. నిజానికి ఆమె కెరీర్లో ఇలా తిరస్కరించిన చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ తాజాగా నటించనని చెప్పిన సినిమాకు ప్రత్యేకత ఉంది. లెజెండ్ శరవణన్ మూడేళ్ల క్రితం 'ది లెజెండ్' అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. భారీ ఖర్చుతో తీసిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తదుపరి చిత్రం చేసేందుకు సిద్ధమై నయనతారని సంప్రదించారని తెలిసింది. భారీ పారితోషికం ఇస్తామని కూడా నిర్మాతలు తెలిపారు. అంగీకరిస్తే రూ.వంద కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారని సమాచారం. కానీ ఇంతటి ఆఫర్ ను కూడా నయన్ తిరస్కరించిందట. దీనికి కారణం కథ నచ్చకపోవడమే అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఒక్కోసారి ఇమేజ్ సరిపోని పాత్రలు చేస్తే విమర్శలు తప్పవు. ఈ విషయంలో భారీ ఆఫర్లను సైతం తారలు తిరస్కరిస్తారనడానికి ఇది తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com