Vishwak Sen : లైలాను చంపకండి.. విశ్వక్ సేన్ విజ్ఞప్తి

"మా కంట్రోల్లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలిచేయకండి. ఇది మా విన్నపం. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం మా సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాను మాత్రం చంపకండి" అని 'లైలా' చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన 'లైలా' చిత్రం ఈనెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దీనిపై విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ "ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఇందులో లేడీ పాత్ర కోసం మానసికంగా హార్డ్ వర్క్ చేశాను. ఫిబ్రవరి 14న ఉదయమే లైలా హెచ్ డీ ప్రింట్ లింక్ పెడతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాయ్ కాట్ లైలా అంటూ ట్వీట్లు వేశారు. నేను ఎందుకు బలికావాలి?, సినిమా వాళ్లం కదా, ఈజీగా టార్గెట్ అయిపోతామా అనిపిస్తోంది. ఆయన మాట్లాడిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం న్యాయమా? సినిమా విడుదలకాకముందే చంపేయకండి" అని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com