Darshan : దర్శన్‌కు రాచమర్యాదల ఎఫెక్ట్.. జైలు మార్చిన అధికారులు

కన్నడ నటుడు దర్శన్ శిక్ష అనుభవించాల్సిన జైలు మారింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించారు. ఆయనకు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చినట్లు తెలుస్తోంది.
పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను.. బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులను కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించనున్నట్లు సమాచారం. జైల్లో దర్శన్‌కు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శన్ కారాగారం బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న చిత్రం ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. రౌడీషీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్ విల్సన్ గార్డన్ నాగ కూడా ఉన్నాడు.
వీడియోకాల్ ద్వారా అతడు 25 సెకన్ల పాటు అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు రావడం ఈ అనుమానాలకు తావిచ్చింది. దీంతో అతడికి జైల్లో రాచ మర్యాదలు అందుతున్నాయని వార్తలు వెలువడ్డాయి. జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం యాక్షన్ లోకి దిగింది. ఏడుగురు పోలీసు అధికారుల ప్రమేయం ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. దీంతో.. దర్శన్ ను మరో జైలుకు షిఫ్ట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com