Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ ను ఎవరు దొంగతనం చేశారో అందరికీ తెలుసు

Kannappa :  కన్నప్ప హార్డ్ డిస్క్ ను ఎవరు దొంగతనం చేశారో అందరికీ తెలుసు
X

కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం వెనక ఉన్నది ఎవరో అందరికీ తెలుసు అంటూ మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి ఓ అఫీషియల్ లెటర్ విడుదలైంది. ఈ హార్డ్ డిస్క్ దొంగతన గురించి రకరకాల వార్తలు వస్తోన్న నేపథ్యంలో అసలేం జరిగింది అనే వివరణ ఇవ్వడానికే ఈ లెటర్ అంటూ రిలీజ్ చేశారు. ఈ లెటర్ సారాంశం చూస్తే.. ఈ హార్డ్ డిస్క్ ముంబైలోని ‘హైవ్’స్టూడియోస్ నుంచి హైదరాబాద్ లోని మంచు విష్ణు నిర్మాణ సంస్థ ఉన్న ఆఫీస్ కు ట్రాన్స్ పోర్ట్ చేయబడింది. అందులో కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయట. అయితే ఆ ప్యాకేజ్ డెలివరీ సమయంలో చట్టవిరుద్ధంగా అడ్డగించి, చరిత అనే మహిళ సూచనల మేరకు వ్యవహరించిన శ్రీ రఘు అనే వ్యక్తి సంతకం చేయడం జరిగిందట. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు లేదా సహచరులు కాదు. వారి చర్యలో మోసం, దొంగతనం ఉన్నాయని చెప్పారు.

దాదాపు నాలుగు వారాల క్రితం అధికారికంగా పోలీసు ఫిర్యాదు దాఖలు చేయబడింది. దీని వెనుక ఉన్న వారి గుర్తింపుపై దర్యాప్తు అధికారులకు పూర్తిగా వివరించబడింది. ఈ ప్రయత్నాన్ని ఎవరు నడిపించారో రహస్యం కాదు - మాకు, పోలీస్ లకు ఆ శక్తుల గురించి బాగా తెలుసు. నేరస్థుడి గుర్తింపు తెలుసు, ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమైంది అంటూ తమ అనుమానాలను స్పష్టం చేశారు.

ఈ లెటర్ లో ఇంకా .. ‘‘మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులు, ఒకే మూలం నుండి వచ్చిన మార్గదర్శకత్వంలో, కన్నప్ప విడుదలను అరికట్టడానికి తీవ్రంగా ప్రయత్నించి, 90 నిమిషాలకు పైగా విడుదల కాని ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ నిఘా ఇటీవల బయటపడింది. దీనికి ప్రతిస్పందనగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు త్వరగా కఠిన చర్య తీసుకోవాలని అధికారికంగా ఫిర్యాదు చేశారు. పరిశ్రమలోనే ఇంత చౌకగా కొందరి వ్యూహాలను అమలు చేయడం నిరాశపరిచింది. ఇది అల్లరి కాదు—ఇది విధ్వంసం. ఇది వ్యక్తిగత కక్ష సాధింపు. దురదృష్టకర దిగజారిన స్థితి. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో, ఇంత స్థాయికి దిగజారడం తిరోగమనమే కాదు - ఇది అవమానకరం. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌గా మార్చడానికి ఎంతో నిబద్ధతతో పనిచేసిన మా బృందం ఐక్యంగా ఉంది.. ఈ పిరికి ప్రయత్నాలకు మేము చలించము. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని మేము విశ్వసిస్తున్నాము.

ఏదైనా పైరేటెడ్ కంటెంట్ బయటపడితే దానిని వినోదపరచవద్దని లేదా ప్రసారం చేయవద్దని, సంవత్సరాల తరబడి కృషి చేసిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడాలని మేము ప్రజలను మరియు మీడియాను కోరుతున్నాము..’’ అని పేర్కొన్నారు.

సో.. ఈ హార్డ్ ఇప్పుడు పోయింది కాదు. నాలుగు వారాల క్రితమే పోయింది. అందుకే రిలీజ్ డేట్ వాయిదా వేశారేమో అనుకోవచ్చు. మరి అది దొరికితేనే విడుదల చేస్తారు కాబట్టి.. ఈ జూన్ 27న కన్నప్ప చిత్రం విడుదల కావడం కాస్త డౌటే అని చెప్పొచ్చు.

Tags

Next Story