Gaddar Awards Ceremony : జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రదానం.. కేటగిరీలు ఇవే

గద్దర్ అవార్డులపై బిగ్ అప్ డేట్ వచ్చింది. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ సమావేశమైంది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, జయసుధ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలనూ ప్రోత్సహిస్తామని తెలిపారు.
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీ వేదిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ కమిటీకి చైర్మన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు అందినట్టు ఇటీవల వెల్లడించారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com