Jetwani Case : జెత్వానీ కేసులో ఎవర్నీ వదలం.. హోంమంత్రి అనిత వార్నింగ్

ముంబై నటి కేసులో ప్రభుత్వం ఎవరినీ బలిచేయలేదని.. బాధిత మహిళకు న్యాయం చేస్తోందని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. చట్ట ప్రకారమే దర్యాప్తు వేగంగా జరుగుతుందని, లోతైన దర్యాప్తులో తేలిన ఆధారాలు పరిశీలించాకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టబోమన్నారు. గత ప్రభుత్వం పైశాచికత్వం వల్ల బలైన అమాయకులు లెక్కలేనంత మంది ఉన్నారని తెలిపారు. కుట్రలు పన్ని బోట్లను ప్రకాశం బ్యారేజీపైకి వదిలారని, కౌంటర్ వెయిట్లు ధ్వంసమై ఉంటే ప్రమాదాన్ని ఊహించగలమా అని ప్రశ్నించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు పనులను హోం మంత్రి అనిత పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి బోట్ల తొలగింపు పనులను పర్యవేక్షించిన అనంతరం మాట్లాడుతూ.. కుట్రలు పన్ని బోట్లను ప్రకాశం బ్యారేజిపైకి వదిలారన్నారు. ఎగువ నుంచి వచ్చిన 11.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వల్ల బరువైన పడవలు మరింత బలంగా వేగంగా వచ్చి ఢీకొని 17 టన్నుల బరువున్న బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమై ఉంటే ప్రమాదాన్ని ఊహించగలమా? అని ఆమె ప్రశ్నించారు.
విజయవాడ ప్రజలు, ఎన్డీయే ప్రభుత్వం చేసుకున్న అదృష్టం వల్లే మరింత ప్రమాదం. జరగకుండా అక్కడితో ఆగిపోయిందన్నారు మంత్రి. విశ్లేషకుల పేరుతో సోషల్ మీడియా ద్వారా అర్థం లేని అనాలసిస్ లు చేయడం తగదని ప్రజల భద్రత పట్ల బాధ్యతతో మాట్లాడాలని హితవు పలికారు. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాకపోతే 50 టన్నుల బరువున్న పడవలు ఎలా బ్యారేజ్ వద్దకు కొట్టుకుని వచ్చాయో విశ్లేషించుకోవాలన్నారు. ఎగువన 200 పడవలు ఉంటే ఈ పడవలే ఎందుకు కొట్టుకు వచ్చాయో చెప్పాలన్నారు. టీవీల ముందు కూర్చుని నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదని హోంమంత్రి అనిత అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com