Chiranjeevi : సినిమాలకే నేను అంకితం.. రాజకీయం పవన్ చూసుకుంటాడు : చిరంజీవి

తాను ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలన్నీ తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి చేస్తారని ఆయన చెప్పారు. 'బ్రహ్మఆనందం' సినిమా వేడుకలకు మంగళవారం చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో తాను ఎంతోమంది రాజకీయ ప్రముఖులను కలిసిన సందర్భంగా, తిరిగి రాజకీయ రంగప్రవేశం చేస్తానన్న ప్రచారం జరుగుతోందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తనకు ఎటువంటి స్వార్థం లేదని, సినీ రంగం మేలుకోసం, ఇతర కార్యక్రమాల కోసమే రాజకీయ ప్రముఖులను కలుస్తున్నానని స్పష్టం చేశారు. నటుడు బ్రహ్మానందంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన సేవాభావాలన్నింటినీ సోదరుడు పూర్తిగా చేపడతారని మెగాస్టార్ అన్నారు. తన కలలను సంపూర్తిగా నెరవేరుస్తారన్న ప్రగాఢ నమ్మకం నాకుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో తాను చాలా ఒత్తిడులకు గురయ్యానని, అప్పట్లో నాకున్న ఒత్తిడిని చూసి నా సతీమణి బాధపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com