Manchu Manoj : నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

తనపై, తన భార్యపై దాడి జరిగిందని తిరుపతి జిల్లా చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న మోహన్ బాబు వర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.
మరోవైపు కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి ప్రవేశించేందుకు మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.
అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com