Janvi Kapoor : వివాదంలో జాన్వీ కపూర్.. మలయాళీ యాసపై విమర్శలు

Janvi Kapoor : వివాదంలో జాన్వీ కపూర్.. మలయాళీ యాసపై విమర్శలు
X

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరమ్ సుందరిలో మలయాళీ అమ్మాయి పాత్రను పోషించడంతో ఈ గొడవ మొదలైంది. ఆమె మాట్లాడిన యాసపై ఒక మలయాళ గాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన పరమ్ సుందరి ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఇందులో జాన్వీ ఒక మలయాళీ యువతిగా కనిపించనుంది. ఆమె వేషధారణ, లుక్ మొదట ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆమె పలికిన యాసపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విషయంపై మలయాళ గాయని పవిత్ర మీనన్ తీవ్రంగా స్పందించారు. మలయాళీ పాత్రకు స్థానిక నటిని ఎందుకు ఎంపిక చేయలేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా జాన్వీ మాట్లాడిన మలయాళ యాసను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో తక్కువ సమయంలోనే వైరల్ అయింది. దీంతో జాన్వీ కపూర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర మీనన్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. అభిమానులు ఆమె వీడియోను రిపోర్ట్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్ ఆ వీడియోను తొలగించింది. అయితే, పవిత్ర మీనన్ ఈ విషయాన్ని వదిలిపెట్టకుండా, తన వీడియో తొలగించబడిన స్క్రీన్‌షాట్‌లను మళ్లీ షేర్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రాంతీయ పాత్రలకు ఆయా భాషల నటులనే తీసుకోవాలని పవిత్రకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు నటనకు భాషతో సంబంధం లేదని, జాన్వీని విమర్శించడం సరికాదని వాదిస్తున్నారు. ఈ వివాదం పరమ్ సుందరి సినిమా విడుదలకు ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Tags

Next Story