Rishab Shetty : కాంతార -1 కు మరో ప్రమాదం .. ఈ సారి ప్రాణమే

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘కాంతార చాప్టర్ 1’. ఫస్ట్ పార్ట్ కాంతారకు దేశవ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అప్పుడూ రిషబ్ శెట్టే హీరో, దర్శకుడు. 20 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏకంగా 350 కోట్ల వరకూ వసూళ్లు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ సారి బడ్జెట్ పెరిగింది. ఫస్ట్ పార్ట్ క్రేజ్ వల్ల బిజినెస్ లోనూ ఆ దూకుడు కనిపించింది. కాంతారకు ముందు ఏ జరిగింది అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రిషబ్. అయితే ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచీ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం కాంతార 1 కోసం వేసిన సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం కాలిపోయింది. కానీ ఎవరికీ ఏం కాలేదు. ఆ మేరకు కొంత ఊపిరి పీల్చుకుంది టీమ్. ఓసారి వేసిన సెట్ కూలిపోయింది. ఈ మధ్య కాలంలో ఉడిపి జిల్లా కొల్లూరులో షూటింగ్ కోసం వెళుతుండగా జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తోన్న వ్యాన్ బోల్తా పడింది. కొందరికి గాయాలయ్యాయి కానీ ప్రాణాపాయం లేదు. బట్ ఈ సారి మాత్రం ఓ ప్రాణం పోయింది.
ఇదే కొల్లూరులో చిత్రీకరణ జరుపుకుంటోందీ మూవీ. ఈ సందర్భంగా కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ షూటింగ్ అనంతరం ఆ పరిసరాల్లో ప్రవహిస్తోన్న సౌపర్ణిక నదిలో సహచరులతో కలిసి ఈతకు వెళ్లాడు. కానీ నీటి లోతును అంచనా వేయడంలో పొరబడ్డ అతను అందులోనే మునిగి చనిపోయాడు. కపిల్ మరణంతో యూనిట్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీస్ లు కేస్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తంగా వరుస ప్రమాదాలతో కాంతార టీమ్ కాస్త కంగారు పడుతోందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com