Kannada Actor Darshan : కన్నడ నటుడు దర్శన్ కు బెయిల్

తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌కు ఊరట లభించింది. ఈ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌తో పాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి బెయిల్ ఇచ్చింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జూన్ 11న దర్శన్ అరెస్టు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్ పంపాడని అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామిని నిందితులు అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్ షాక్ సైతం పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే తాత్కాలిక బెయిల్‌పై ఉన్న దర్శన్ తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ వేయగా.. ఉపశమనం కలిగింది. దర్శన్ ప్రస్తుతం వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com