నన్ను చంపేయండి.. బతకలేను.. కన్నడ స్టార్ హీరో ఆవేదన..

నన్ను చంపేయండి.. బతకలేను.. కన్నడ స్టార్ హీరో ఆవేదన..
X

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో తనను అవమానిస్తున్నారని, అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. జైలు జీవితం కంటే తనను విషం ఇచ్చి చంపేయమని కోర్టును అభ్యర్థించారు.

కేసు విచారణలో భాగంగా దర్శన్‌ను కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "చాలా రోజులుగా నేను సూర్యరశ్మిని చూడలేదు. చర్మంపై ఫంగస్ భయపెడుతోంది. నా బట్టలు కూడా దుర్వాసన వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. దయచేసి నాకు విషం ఇవ్వండి. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది" అని వేడుకున్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, "అలాంటివి చేయడం కుదరదు, అది సాధ్యం కాదు" అని స్పష్టం చేశారు.

కాగా ఈ కేసులో దర్శన్‌కు గతంలో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్ రద్దు చేసింది. జైలులో ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకూడదని కూడా ఆదేశించింది. దీంతో దర్శన్‌ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తనను బళ్లారి జైలుకు తరలించవద్దని, బెడ్, పరుపు వంటి సౌకర్యాలు కావాలని కూడా దర్శన్ కోర్టును కోరారు.కాగా ఈ హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ సన్నిహితురాలైన పవిత్రా గౌడకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Next Story