Mohan Babu : చంద్రబాబుని కలవడానికి కరణం అదే అన్న మోహన్ బాబు..

Mohan Babu : చంద్రబాబుని కలవడానికి కరణం అదే అన్న మోహన్ బాబు..
Mohan Babu : రాజకీయాల కోసం చంద్రబాబును కలవలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

Mohanbabu : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటికి మంచు మోహన్‌బాబు వెళ్లారు. ఏకంగా రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. ఏంటీ..... చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబా..! సహజంగానే ఇప్పుడీ ప్రశ్న తెరపైకి వచ్చింది. రాజకీయంగా చంద్రబాబుతో తీవ్రంగా విభేదించి.. గత ఎన్నికల్లో TDPకి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు ఆయన ఇంటికే మోహన్‌బాబు వెళ్లడం ఏంటి..! ఇప్పుడిది AP రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు.. సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యంలేదని చెప్పుకొచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌లో నిర్మించిన సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించానని తెలిపారు. ఈ మాటలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు నుంచి YCP జెండా మోయడం మొదలెట్టిన మోహన్‌బాబు.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇదే శ్రీవిద్యానికేతన్‌ వేదికగా చేసుకుని చంద్రబాబు టార్గెట్‌ చేశారు.

విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలంటూ ధర్నాకు దిగారు. రంగంపేట రోడ్డుపై బైఠాయించి పెద్ద రచ్చే రాజేశారు. నాడు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నమోదైన కేసులో ఇటీవలే కోర్టుకు కూడా హాజరయ్యారు. శ్రీవిద్యానికేతన్‌ కేంద్రంగా రాజకీయంగా నాడు చంద్రబాబును ఇబ్బంది పెట్టిన మోహన్‌బాబు.. ఇప్పుడు అదే స్కూల్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ఆహ్వానించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షిర్డీ సాయినాథుని అమితంగా ఇష్టపడే, ఆరాధించే మోహన్‌బాబులో ఈ మార్పునకు కారణం ఏంటి..? ప్రత్యర్థిగా చూసిన వ్యక్తినే ప్రతిష్టకు ఆహ్వానించడం వెనుక ఏం జరిగింది..?

CM జగన్‌ అత్యంత దగ్గర బంధువే అయినా.. YCP పెద్దల్ని కాదని ప్రతిపక్ష నేతను పిలవడం ఏంటి..? మోహన్‌బాబు రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఇలా ఇప్పుడెన్నో సమాధానం లేని ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

పాత విషయాలన్నీ పక్కకుపెట్టి మోహన్‌బాబే వెళ్లి చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. YCP తరపున గట్టిగానే గళం వినిపించినా.. ఎలాంటి పదవీ దక్కకపోవడం ఈ మార్పునకు కారణమా..? అదే నిజమనుకుంటే తాను BJP మనిషిననని ఇటీవల ఆయన వ్యాఖ్యానించడానికి కారణాలేంటి..? BJP మనిషిని అంటూనే ఇప్పుడు చంద్రబాబును కలవడం ఏంటి..? ప్రస్తుతానికైతే అంతా ఫజిల్‌లానే ఉంది.

ముక్కుసూటి మనిషినని చెప్పుకునే మోహన్‌బాబు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తే. చంద్రబాబుతోనూ సన్నిహిత్యం ఉంది. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలతో మోహన్‌బాబు TDPని వీడారు. తర్వాత పొలిటికల్‌గా సైలెంట్‌ అయ్యారు. 2019కి ముందు YCPలో చేరారు. కుమారుడు విష్ణు ద్వారా YS కుటుంబంతో బంధుత్వం ఏర్పడ్డి ఎన్నో ఏళ్లయినా.. గత ఎన్నికల ముందే ఆయన కండువా కప్పుకున్నారు. కానీ.. ఆయనకు అనుకున్న ప్రాధాన్యం తక్కలేదనేది ఓపెన్‌ సీక్రెట్టే.

కొద్ది నెలల క్రితం ఏపీలో సినిమా టికెట్ల వివాదం తలెత్తింది. అప్పుడు CM జగన్‌తో ఎవరు మాట్లాడతారు..! టాలీవుడ్‌ పెద్దగా మోహన్‌బాబు రంగంలోకి దిగుతారా..? అనే చర్చ జరిగినా చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే మోహన్‌బాబు విజయవాడ వెళ్లినా CM అపాయింట్‌మెంట్ ఖారరు కాకపోవడం కూడా అప్పట్లో దుమారం రేపింది. ఇలాంటి పరిణామాలన్నీ జగన్‌కి మోహన్‌బాబుకి మధ్య దూరం పెరగడానికి కారణం అయ్యాయనే వాదనైతే వినిపిస్తోంది.

ఒక్కసారి మాట తేడా వస్తే ఫసక్‌. ఆ ఫ్రెండ్‌షిప్‌ అక్కడితో కట్‌. ఇది మోహన్‌బాబు నైజం అంటారు. కానీ ఇప్పుడు ఆయనకు ఏ ఝలక్‌ తగిలిందో తెలియదు కానీ.. వదులుకున్న స్నేహాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గడప తొక్కడం, శ్రీవిద్యానికేతన్‌లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టకు రావాలని పిలవడం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story