Naba Natesh : తప్పక అలా చేశాను : నభా నటేష్

Naba Natesh : తప్పక అలా చేశాను : నభా నటేష్
X

సినిమాల్లో నటనలో హీరోలకు హీరోయిన్లు ఏం తక్కువ కాదు అని నిరూపిస్తోంది నభా నటేష్. తన అంద చందాలతో, వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇటీవల ప్రియదర్శితో కలిసి నటించిన డార్లింగ్ మూవీతో పలకరించిన ఈ అమ్మడు సినిమాల్లో రాణించేందుకు తాను పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. ” బెంగళూరులో మోడలింగ్ తో పాటు ఓ నాటక బృందంలో చేరి నాటకాలు కూడా ప్రదర్శించడం అలవాటు చేసుకున్నాను. అప్పటికే కొన్ని వీధి నాటకాలు కూడా ప్రదర్శించాను. ఆ అనుభవంతోనే సినిమాలో ప్రయత్నించాలనే ఆలోచన వచ్చి మొదలుపెట్టాను. అప్పుడే కన్నడలో శివ రాజ్కుమార్ పక్కన వజ్రకాయలో అవకాశం వచ్చింది. ఆ షూటింగ్కు మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను. ఓ పల్లెటూరి అమ్మాయిలా అందులో కనిపించాను. ఈ సినిమా కోసం వచ్చిన చాలా అవకాశాల్ని కూడా వదులుకున్నాను. ఈ సినిమా కోసమే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. అంతేకాదు నాకు అసలు పొగ అంటే పడదు. కానీ పాత్ర కోసం బీడీలు కాల్చాను. ఆ వాసన భరించలేక రెండ్రోజులు ఏమీ తినలేకపోయాను. అయితే నా కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు నాకు ఆ సినిమాతో లభించింది' అంటూ చెప్పుకొచ్చారు. తనకు తెలుగులో మొదట అవకాశం ఇచ్చింది నటుడు, డైరక్టర్ రవిబాబు అని చెప్పుకొచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అదుగో' ఫస్ట్ మూవీ. రెండో మూవీ 'నన్ను దోచుకుందువటే'. అని తెలిపింది. అంతే కాదు తన తండ్రి నటేషన్ లోని 'న' అక్షరాన్ని, అమ్మ భాగ్యలోని 'భా' అక్షరాన్ని తీసుకుని 'నభా' అని పేరు పెట్టారని చెప్పుకొచ్చింది. నభా అంటే సంస్కృతంలో ఆకాశం అనే అర్థం వస్తుందని తెలిపింది ఈ బ్యూటీ.

Tags

Next Story