NTR : బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

NTR : తెలుగు ప్రేక్షకుల, ప్రజల గుండెల్లో అన్న నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలు హిందూపురం ఎమ్మెల్యే 'నటసింహ'నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరగనున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం బాలకృష్ణ గారి చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరు లోను, సాయంత్రం తెనాలిలోనూ ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరగనున్నాయి. అన్న గారి శత జయంతి వేడుకలు అంటే.. 10 కోట్ల మంది తెలుగు వారికి ప్రతి ఇంటి పండగ. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. స్వర్గీయ తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com