Prabhas : ఒన్ అండ్ ఓన్లీ డార్లింగ్, రెబల్ స్టార్.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్

ప్రభాస్.. ఓ సాధారణ కమర్షియల్ సినిమాతో మొదలైన ప్రభాస్ కెరీర్ బాహుబలితో కమర్షియల్ సినిమా లెక్కల్నే మార్చివేసింది. తెలుగు సినిమా హిస్టరీని బాహుబలికి ముందు తర్వాత అని చేర్చేలా చేసింది రాజమౌళి ఊహ అయితే ఆ ఊహకు ప్రాణం పోసింది ప్రభాస్. వ్యక్తిత్వంలో డార్లింగ్ గా, సినిమా నటుడుగా రెబల్ స్టార్ గా ఏకకాలంలో ఆడియన్స్ మన్ననలు పొంది ఎల్లలు దాటిన ఖ్యాతిని సంపాదించుకున్న ఈ రాజా సాబ్ బర్త్ డే ఇవాళ(బుధవారం).
అప్పుడప్పుడే తెలుగులో వారసత్వ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. అందర్లోకీ ప్రత్యేకంగా హీరో అంటే ఆజానుబాహుడు అనే మాటకు నిలువెత్తు రూపంగా తొలి సినిమా ఈశ్వర్ తో వచ్చాడు ప్రభాస్.పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమాకే యంగ్ రెబల్ స్టార్ అన్న పేరు తెచ్చుకుని... కృష్ణంరాజుకు సరైన వారసుడు వచ్చాడు అనిపించుకున్నాడు. అలా మొదలైన ప్రభాస్ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులనే మెస్మరైజ్ చేసేంతగా సాగడం నిజంగా ఆశ్చర్యమే..
ప్రభాస్.. ఫస్ట్ మూవీ ఈశ్వర్ లో చూసినప్పుడే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. టాలీవుడ్ కు మరో ఆజానుబాహుడైన హీరో వచ్చాడని.. నటనలో ఈజ్ ఉంది. కానీ డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ కావాలన్నారు చాలామంది. కానీ కుర్రాడిలో ఏదో స్పార్క్ మాత్రం ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. అదే నెక్ట్స్ మూవీలో రెబలిజం చూపించాడానికి ఉపయోగపడింది. వెరీ యాంగ్రీ యంగ్ మేన్ గా రాఘవేంద్రలో ప్రభాస్ యాక్షన్ స్టార్ గా అవతరించాడు.
వర్షం.. లవర్ బాయ్ గా యాక్షన్ స్టార్ గా, మంచి ఫ్రెండ్ గా అన్ని ఎమోషన్స్ ను పండించే చాన్స్ వచ్చిందీ సినిమాతో. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రెండు సినిమాకు రాని రికగ్నిషన్ వర్షంతో వచ్చింది. ఈ సినిమా నుంచే అతనికి పర్సనల్ గానూ సరికొత్త ఫ్యాన్ బ్యాంక్ స్టార్ట్ అయింది.. ఇండస్ట్రీలోనూ ప్రభాస్ ను ప్రామినెంట్ స్టార్ గా నిలిపింది కూడా వర్షమే.
వర్షం సక్సెస్ ను కంటిన్యూ చేసే జోష్ లో మళ్లీ యాక్షన్ లవ్ స్టోరీ. అడవిరాముడు. అప్పటి డ్రీమ్ గాళ్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్. కానీ వర్షం తో పోలిస్తే ఇది పెద్దగా కిక్ ఇవ్వలేదు. కెరీర్ పరంగా రిస్క్ చేసి మరీ చేసిన చక్రం తన కెరీర్ ను తిప్పలేదు కానీ.. అతనిలోని అద్భుతమైన నటుడ్ని చూపించేందుకు ఉపయోగపడింది. యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్ కు పూర్తి నీరసంగా ఉండే క్యారెక్టర్ చేసిన చక్రం ఫ్లాప్ అయినా.. ప్రభాస్ కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ప్రభాస్ ఆజానుబాహుడు. తన తరం హీరోలకు లేని హైటూ పర్సనాలిటీ ఉన్నాయి. కానీ అందుకు తగ్గ సినిమాల్లేవు. ఈ నిరాశ అటు కృష్ణంరాజులోనూ ఉన్న టైమ్ లో రాజమౌళి ఎంట్రీ ప్రభాస్ కెరీర్ నే మార్చివేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తన పర్ఫార్మెన్స్ తో ఈ పాత్రను ఎందరో హీరోలు చేయాలనుకునే డ్రీమ్ రోల్ గా మార్చాడు ప్రభాస్. ఛత్రపతి తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో మారింది.
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి అనేలా చేసింది ఛత్రపతి సినిమానే. ఇందులో ప్రభాస్ చూపించిన ఎమోషన్స్ కు బరస్ట్ కాని ఆడియన్స్ ఉండరు. ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా అద్భుతమైన వేరియషనూ చూపించాడు.
ఓ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ విజయపరంపరను కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు ప్రభాస్. వరుసగా యావరేజ్ సినిమాలే పడ్డాయి. ప్రతి సినిమా అంచాల్ని పెంచింది. ఛత్రపతి తర్వాత చేసిన పౌర్ణమి పెద్ద మిస్టేక్. అది మిస్ ఫైర్ అయిందని యోగి, మున్నాలతో యాక్షన్ చేశాడు. ఇవీ అంతే. పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ సందిగ్ధంలో పడ్డాడు ప్రభాస్.
ప్రభాస్ కెరీర్ సమూలంగా మార్చింది మాత్రం పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. అప్పటి వరకూ ప్రభాస్ బాడీ మరీ ఫ్లెక్సిబుల్ గా ఉండేది కాదు. డైలాగ్స్ కూడా పట్టిపట్టి చెబుతున్నాడన్నారు. కానీ పూరీ ఎంట్రీతో ప్రభాస్ బుజ్జిగాడైపోయాడు. ఒక్కసారిగా అతని డైలాగ్ డెలివరీ లో వచ్చిన ఈజ్ కు ఆడయన్స్ సర్ ప్రైజ్ అయిపోయారు. ఇలాంటి పోకిరీ పాత్రల్లోనూ ప్రభాస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లతో ప్రూవ్ చేశాడు పూరీ జగన్నాథ్..
తన కెరీర్ లోనే స్టైలిష్ మూవీ బిల్లా. బాలీవుడ్ డాన్ కు రీమేక్ గా వచ్చిన బిల్లాలో ప్రభాస్ స్టైలింగ్ పీక్స్ లో కనిపిస్తుంది. కెన్ కెన్ అనే ఊతపదంతో తనవరకూ ఊపేశాడు. పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ఫస్ట్ టైమ్ తెరనూ పంచుకున్నాడు. ఆయనతో కలిసి చేసిన ఓ సీన్ ఈ సినిమాలో సూపర్ హైలెట్స్ లో ఒకటి.
ఛత్రపతి తర్వాత ప్రభాస్ ఆరు సినిమాలు చేశాడు. అవేవీ ఛత్రపతి స్థాయి విజయాలు కావు. కొన్ని ఫ్లాప్ అనిపించుకుంటే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. దీంతో ఛత్రపతిని మర్చిపోయేలోగా ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మళ్లీ రూట్ మార్చాడు ప్రభాస్. తన ఊతపదం టైటిల్ గా డార్లింగ్ అంటూ వచ్చాడు. అప్పటి వరకూ చూడనంత హ్యాండ్సమ మేకోవర్ తో వచ్చిన డార్లింగ్ ప్రభాస్ లో మరో యాంగిల్ ను చూపించింది.
నిజానికి కరుణాకరన్ డైరెక్ట్ చేసిన డార్లింగ్ కూడా సూపర్ హిట్టేం కాదు. కానీ అందులో ప్రభాస్ లుక్కు చూసి అమ్మాయిలు కునుకులు మరచిపోయారు. తమ కలల రాకుమారుల పోస్టర్లన్నీ చించేసి ప్రభాస్ ఫోటోస్ అతికించేశారు. ప్రభాస్ మేకోవర్ ను పూర్తిగా మార్చి వేసిన సినిమాగా ఫస్ట్ డార్లింగ్ నే చెప్పాలి.
డార్లింగ్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ మరో వైవిధ్యమైన ప్రయత్నం మిస్టర్ పర్ఫెక్ట్. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ మంచి విజయం సాధించింది. ఇందులోనూ చాలా యాక్టింగ్ లో చాలా వేరియేషన్స్ చూపించే చాన్స్ వచ్చిందతనికి. కాజల్, తాప్సీల మధ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో బాగా ఆకట్టుకున్నాడు ప్రభా.
లారెన్స్ దర్శకత్వంలో కృష్ణంరాజుతో కలిసి నటించిన రెబల్ డిజాస్టర్ గా మారింది. అది బాగా నిరాశపరిచింది. ఈ లోగా రాజమౌళి ఈగ తర్వాత ఓ పెద్ద ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు. దాని రూపురేఖలు అప్పుడు ఎవరికీ తెలియకపోయినా ప్రభాస్ హీరోగా డిసైడ్ అయ్యాడు. ఆ సినిమా స్టార్ట్ కావడానికి కొంత టైమ్ ఉందనగా ఓ కొత్త దర్శకుడిని నమ్మి మిర్చి మూవీ చేశాడు. కట్ చేస్తే మిర్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడైపోయాడు.
ఇప్పటి వరకూ ప్రబాస్ ప్రస్థానం వేరే. ఇప్పటి వరకూ చేసిని సినిమాలూ వేరే. ప్రతి సినిమా ప్రభాస్ లోని నటుడ్ని ఒక్కో మెట్టు పైకి ఎక్కించిందే. యాక్షన్ నుంచి డిక్షన్ వరకూ ఎవ్రీ మూవీతో ఎంతో ఎదిగిపోయాడు. డైలాగ్ డెలివరీలోనూ చాలా మార్పులు వచ్చాయి. అతని ఫిజిక్ తో పాటు తను నేర్చుకున్న ఈ క్వాలిటీస్ అన్ని కలిపి బాహుబలిలో ప్రభాస్ ను పర్ఫెక్ట్ గా ఫిట్ చేశాయి.
చరిత్ర సృష్టిచేటప్పుడు ఎవరికీ తెలియదు. అలాగే బాహుబలి.. మొదలైనప్పుడు దాని రేంజ్ ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కో షెడ్యూల్ పూర్తవుతున్నప్పుడు.. రేంజ్ మార్చుకుంటూ వెళ్లిన బాహుబలి.. విడుదలైన తర్వాత తెలుగు సినిమాగా కాక ఇండియన్ గా మారి.. ఇంటర్నేషనల్ లెవెల్లో మన సత్తా ఏంటో చూపించింది. శివుడుగా, బాహుబలిగా ప్రభాస్ నటనకు, రాజసానికి, వాల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు..
బాహుబలి దెబ్బతో ఎంటైర్ సౌత్ బాహుబలికి ముందు తర్వాత అన్నట్టుగా మారిపోయింది. ఏ రికార్డ్ గురించైనా మాట్లాడాలంటే నాన్ బాహుబలి రికార్డ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెండితెరపై ఓ దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. వందలమంది కష్టం.. ఎందరిదో మేధస్సు.. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆ అద్భుతాన్ని ఆడియన్స్ కు అందించాడు రాజమౌళి..
ఇక రెండో భాగం.. బాహుబలి ద కంక్లూషన్.. ఫస్ట్ పార్ట్ లో ఏం మిస్ అయ్యారో అవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువే చూపించి ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. రాజమౌళి విజన్ లో అత్యద్భుతంగా ఒదిగిపోయాడు ప్రభాస్. ఎమోషన్స్ కు పీక్స్ లో చూపించడంలో రాజమౌళి రేంజ్ ను డబుల్ చేసిన.. సూపర్బ్ పర్ఫార్మెన్స్ కంక్లూషన్ పార్ట్ లో మరోసారి చూపించాడు ప్రభాస్..
నమ్మకం నిజాయితీ ఉన్న చోట విజయం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభాస్ రాజమౌళిని నిజాయితీగా నమ్మాడు. ఆ నమ్మకం విలువ కొన్ని వందల కోట్లు. కానీ దీన్ని డబ్బులుగా చూడకూడదు. కళపై వారికున్న ప్యాషన్ గా చూడాలి. రాజమౌళి, ప్రభాస్ ల పరస్పర మైత్రిగా నమ్మాలి. అలా నమ్మారు కాబట్టే బాహుబలి ఇండియన్ సినిమా రేంజ్ ను ప్రపంచానికి చూపించింది.
ఎలాగైతే ఛత్రపతి తర్వాత యావరేజ్ మూవీస్ తో ఇబ్బంది పడ్డాడో అలాగే బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో ఇబ్బంది పడ్డాడు. ఇవేం ఫ్లాపులు కాదు. కాకపోతే అంచనాలను అందుకోలేదంతే. బట్ సలార్ తో ఆ లోటు తీరింది. కల్కి ఇంకా బెటర్ అనిపించుకుంది. ప్రస్తుతం రాజా సాబ్ గా రెడీ అవుతున్నాడు. తర్వాత హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డితో స్పిరిట్, సలార్ 2 చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఇవన్నీ బ్లాక్ బస్టర్ లుక్స్ తోనే కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రభాస్ తెలుగు సినిమా రాజసానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. సినిమాలతోనే కాక వ్యక్తిత్వంతోనూ కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అలాగే ఉండాలని.. ఈ రాజా సాబ్ మరెన్నో సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ.. ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com