Pooja Hegde: ప్రభాస్‌తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన పూజా.. షూటింగ్ సమయంలో..

Pooja Hegde: పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ప్రేమకథ 'రాధే శ్యామ్'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కలెక్షన్ల విషయంలో కచ్చితంగా రాధే శ్యామ్.. బాహుబలిని మించిపోతుందని కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రభాస్‌కు, తనకు మధ్య విభేదాలు వచ్చాయన్న విషయంపై పూజా స్పందించింది.
రాధే శ్యామ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే.. ఇద్దరూ దేశమంతా చుట్టేస్తూ.. ప్రతీ భాషలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. వీరిద్దరు మాత్రమే కలిసి పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు. ఆ సమయంలో వారిద్దరు పెద్దగా సన్నిహితంగా ఉన్నట్టు కనిపించట్లేదు. అంతే కాకుండా వీరిద్దరు కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని అర్థమవుతోంది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ కథనాలు ప్రచారం అవ్వడం మొదలయ్యింది.
ప్రభాస్‌తో గొడవ అన్న వార్తలపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడని తెలిపింది పూజా. అంతే కాకుండా షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకోసం ఇంటి నుండి భోజనం తెప్పించేవాడని తెలిపింది.
ప్రభాస్ చాలా మంచి మనిషని, అలాంటి వ్యక్తితో తనకు మాటలు లేకపోవడమేంటి అని గొడవ గురించి కథనాలపై ఓ క్లారిటీ ఇచ్చింది పూజా. అలాంటి వ్యక్తితో ఎవరైనా మాట్లాడకుండా ఎలా ఉంటారని అడిగింది. అయితే ప్రభాస్, పూజాకు మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. రాధే శ్యామ్ షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్.. పూజా ప్రవర్తనపై కాస్త అసహనంగా ఉన్నాడంటూ రూమర్స్ వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com