Iman Esmail : తన జాతీయతపై ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ

Iman Esmail :  తన జాతీయతపై ప్రభాస్ హీరోయిన్ క్లారిటీ
X

కశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక యాత్రికులపై టెర్రరిస్ట్ లు జరిపిన దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. పాకిస్తాన్ పై మరోసారి ప్రజలంతా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తోన్న ఫౌజీ మూవీ హీరోయిన్ ఇమాన్విపైనా విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ఈ హీరోయిన్ ను సినిమా నుంచి తప్పించాలనే డిమాండ్స్ కూడా దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె తండ్రి మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి అనే ఆరోపణలు స్ట్రాంగ్ గా వచ్చాయి. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ ఓ లెటర్ విడుదల చేసింది ఇమాన్వి.

‘ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులైన వారందరి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కోసం నా హృదయం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఈ హింసాత్మక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా ప్రేమను, కాంతిని, ప్రేమను పంచడమే లక్ష్యంగా ఉన్న నేను మనందరం ఒక్కటిగా కలిసి వచ్చే రోజు కోసం చూస్తున్నాను. ఇక కొందరు ఈ సందర్భంలో విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, విభజనలు సృష్టించడానికి సోషల్ మీడియా వేదికగా ఆధారం లేని వార్తలను వ్యాపింప చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నవారు కూడా నిజా నిజాలు నిర్ధారించుకోకుండానే.. అవే మాట్లాడుతున్నారు.

అసలు విషయం ఏంటంటే.. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో ఇప్పటి వరకూ ఏ విధమైన సంబంధాన్ని కలిగి లేరు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన ద్వేష పూరిత అబద్ధాలు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే ఇండో అమెరికన్ ను. లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో జన్మించాను. నా తల్లి తండ్రులు చట్ట బద్ధంగా వారు యుక్త వయసులో ఉండగానే యూనైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చారు. అమెరికన్ పౌరులుగా మారారు. నేను యూఎస్ఏలో యూనివర్శిటీ స్టడీస్ పూర్తి చేశాను. తర్వాత యాక్ట్రెస్ గా, కొరియోగ్రాఫర్ గా కళారంగంలో కొనసాగుతున్నాను. వీటి ద్వారానే ఇండియన్ సినిమాలో పనిచేసే అదృష్టం వచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. నా రక్తంలో లోతుగా నడుస్తున్న భారతీయ గుర్తింపు సంస్కృతిని కలిగి ఉన్న వ్యక్తిగా, నేను ఈ మాధ్యమాన్ని విభజనకు కాకుండా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని ఆశిస్తున్నాను. విషాదకరమైన ప్రాణనష్టం గురించి మనం దుఃఖిస్తున్నప్పుడు, ప్రేమను పంచడం మరియు ఒకరినొకరు ఉద్ధరించుకోవడం కొనసాగిద్దాం’.. అంటూ ఒక సుదీర్ఘమైన లేఖను విడుదల చేసింది. మరి దీనికి నెటిజన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.

Tags

Next Story