Prabhas Project K: ఒకే కథ.. రెండు పాన్ ఇండియా సినిమాలు.. కాంట్రవర్సీలో 'ప్రాజెక్ట్ కే'..

Prabhas Project K: ఈమధ్య ప్రతీ భాషలో పాన్ ఇండియా సినిమాల హవా మొదలయ్యింది. భాషను దాటి ప్రతీ మూవీ లవర్‌కు తమ సినిమా చేరాలన్న ఉద్దేశ్యంతో దర్శకులు ఎక్కువగా ఈ పాన్ ఇండియా సినిమాలవైపే మొగ్గుచూపుతున్నారు. కానీ అలాంటి ఓ రెండు పాన్ ఇండియా చిత్రాలు ప్రస్తుతం కాంట్రవర్సీలో పడిపోయాయి. ఆ రెండు కథలు ఒకేలాగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో దర్శకుడు కథను మార్చే పనిలో పడ్డాడట.
హిందీలో ఎప్పుడూ లేని విధంగా 'బ్రహ్మాస్త్ర' అనే ఓ గ్రాండ్ మైథలాజికల్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. రణభీర్ కపూర్, నాగార్జున, అమితాబ్ బచ్చన్‌లాంటి స్టార్లు నటిస్తున్న ఈ సినిమా కోవిడ్ ఫస్ట్ వేవ్ మొదలవ్వక ముందు షూటింగ్‌ను ప్రారంభించుకుంది. కానీ పలు కారణాల వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. తాజాగా బ్రహ్మాస్త్ర నుండి విడుదలయిన రణభీర్ కపూర్ ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ అందింది.
మరోపక్క తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేసుకుంటూ వెళ్తున్నాడు. వాటన్నింటికి మించి యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్ కే' అనే పాన్ వరల్డ్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు 'ప్రాజెక్ట్ కే'కు, 'బ్రహ్మస్త్ర'కు మధ్య ఓ కాంట్రవర్సీ తలెత్తింది.
ప్రాజెక్ట్ కే, బ్రహ్మాస్త్ర.. ఈ రెండు చిత్రాలు మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిపిన కథలు. అయితే ఈ రెండు కథలలో చాలావరకు పోలికలు ఉన్నాయని ఇటీవల మూవీ టీమ్స్‌కు తెలిసింది. అయితే బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావడంతో ప్రాజెక్ట్ కే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే కథలో మార్పులు చేర్పులు చేసే పనిలో లీనమయ్యాడట నాగ్ అశ్విన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com