Prabhas : కొడుకు కోసం బ్రహ్మానందం మెగా, రెబల్ ప్రయత్నం

హాస్య బ్రహ్మ జంధ్యాల అందించిన హాస్యాణిముత్యం బ్రహ్మానందం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న నవ్వుల రారాజు ఆయన. ప్రస్తుతం వయోభారంతో కాస్త సినిమాలు తగ్గించుకున్నా.. అప్పుడప్పుడూ తనకే సొంతమైన కామెడీతో కితకితలు పెడుతున్నారు. అయితే హీరోల కొడుకులు హీరోలవుతున్నారు. కమెడియన్స్ కొడుకులు హీరోలైతే జనం చూస్తారా అంటే కంటెంట్ ను బట్టి ఉంటుందని అందరికీ తెలుసు. బ్రహ్మానందం తన పెద్ద కొడుకు రాజా గౌతమ్ ను హీరోగా చూడాలనుకున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో సుచిత్ర దర్శకత్వంలో అతను 2004లో పల్లకిలో పెళ్లికూతురు అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ మ్యూజికల్ గా హిట్. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. పదేళ్ల తర్వాత బసంతి అనే మూవీతో వస్తే అదీ ఆకట్టుకోలేదు. తర్వాత చారుశీల, మను వంటి ప్రయత్నాలు చేశాడు కానీ హీరోగా క్లిక్ కాలేకపోయాడు.
ఇప్పుడు రాజా గౌతమ్ హీరోగా 'బ్రహ్మ ఆనందం' అనే మూవీ వస్తోంది. ఇందులో రాజాకు తాతగా బ్రహ్మానందం నటించడం విశేషం.వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘుబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ఈ నెల 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్ ను ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు.
నిజానికి బ్రహ్మానందం ఇండస్ట్రీ పెద్దలను ఏదైనా అడిగితే నో చెప్పేవాళ్లు ఉండరు. ఇన్నేళ్ల తర్వాత కొడుకు కోసం ఇద్దరు టాప్ స్టార్స్ ను ఉపయోగించుకుంటున్నాడు. ఇదేదో గతంలోనే చేసి ఉంటే రాజా గౌతమ్ ఇప్పటికే కొంత వరకైనా సెటిల్ అయ్యి ఉండేవాడేమో కానీ.. బ్రహ్మానందం అడిగితే ప్రభాస్ అయినా చిరంజీవి అయినా కాదంటారా..? మరి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఎంట్రీతో బ్రహ్మా ఆనందం మూవీకి ఎంత మేరకు బూస్టప్ వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com