Pushpa 2 : పుష్ప 2 వసూళ్ల పరంపర.. రూ.1600 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 కలెక్షన్ల సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. విడుదలైన 18వ రోజైన ఆదివారం (డిసెంబర్ 22) ఈ సినిమా అంచనాలను మించి రూ.33.25 కోట్లు కొల్లగొట్టింది. మూడవ వారం వీకెండ్‌లో ఏకంగా రూ.72.3 కోట్లు రాబట్టిందని, ఈ కలెక్షన్లను అనేక చిత్రాలు ఓపెనింగ్స్ రూపంలో కూడా రాబట్టలేకపోయాయని మూవీ కలెక్షన్లు ట్రాక్ చేసే ‘శాక్‌నిల్క్’ తెలిపింది. ఆదివారం రూ. 33.25 కోట్లు, శనివారం రూ.24.75 కోట్లు, శుక్రవారం రూ.14.3 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా చూసుకుంటే.. పుష్ప-2 వసూళ్లు రూ.1,062.9 కోట్లకు చేరాయి. 2017 నుంచి ఏడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి-2 రూ.1,040 కోట్లు వసూళ్లను పుష్ప-2 అధికారికంగా అధిగమించినట్టేనని సినీ ట్రేడ్ పండితులు విశ్లేషించారు. ఆదివారం వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 కలెక్షన్లు రూ.1600 కోట్లు దాటాయి. దీంతో.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది పుష్ప2. మొదటి స్థానంలో దంగల్ (రూ.2 వేల కోట్లు పైగా), రెండో స్థానంలో బాహుబలి-2 (రూ.1,790 కోట్లు) వుండగా ఆ తర్వాతి స్థానంలో పుష్ప-2 నిలిచింది. రాబోయే క్రిస్మస్, న్యూఇయర్ వరకు బాహుబలి 2 ఆల్ టైమ్ కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com