R Narayana Murthy : మంత్రి పేర్ని నానిని కలిసిన పీపుల్స్ స్టార్ ..!

R. Narayana Murthy : ఏపీలో సినిమా టికెట్ల వివాదం, ధియేటర్లు మూతపడడంపై ఆందోళన వ్యక్తం చేసిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానీని కలిసారు. మచిలీపట్నం వెళ్లి క్యాంప్ ఆఫీస్‌లో నానీతో సమావేశం అయ్యారు. కొన్ని విషయాలపై వ్యక్తిగతంగా మాట్లాడడం ద్వారా ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మంత్రిని కలిసినట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేనని అన్నారు.
సినిమా తీసేవాళ్లు, సినిమా చూపించేవాళ్లు, సినిమా చూసేవాళ్లు ముగ్గురూ బావుండాలి అంటూ ఇటీవలే ఆర్.నారాయణమూర్తి ఆవేశంగా మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలోని పరిస్థితుల కారణంగా ధియేటర్లు మూతపడుతున్నాయని, దీనివల్ల వందలాది కుటుంబాలపై ఆ ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అంతా బావున్నప్పుడే సినిమా రంగం కళకళలాడుతుందని, ఏమైనా సమస్యలుంటే ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మొన్న అదే మీటింగ్‌లో ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, త్వరలోనే ఏపీ పెద్దల్ని కలుస్తామని వివరించారు. ఐతే.. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయో స్పష్టత రాలేదు. ఇంతలోనే ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి నేరుగా మచిలీపట్నం వెళ్లారు. మంత్రి పేర్ని నానీని కలిసారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ధియేటర్లు మూతపడకుండా చూడాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com