Pawan Kalyan : రజినీ ఎంతో మందికి స్ఫూర్తి.. పవన్ ప్రశంసలు

Pawan Kalyan : రజినీ ఎంతో మందికి స్ఫూర్తి.. పవన్ ప్రశంసలు
X

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని పవన్ కొనియాడారు. ‘‘వెండితెరపై సూపర్‌ స్టార్ రజనీ అని టైటిల్ కనిపిస్తే థియేటర్లు ఎలా మార్మోగుతాయో నేను పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా ఆయనపై అభిమానులకు ఉన్న ఆనందం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి అభిమానాన్ని దక్కించుకున్న నటుడు రజనీకాంత్. అయిదు దశాబ్దాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని అన్నారు.

రజనీకాంత్ తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారని పవన్ ప్రశంసించారు. ఆయన నడక, సంభాషణలు, హావభావాలు అన్నీ ప్రత్యేకమేనని.. ఇప్పటికీ నవతరం ప్రేక్షకుల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. నటుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నప్పటికీ ఆధ్యాత్మికత, యోగాపై రజనీకాంత్ చూపే శ్రద్ధ ఆయన భక్తి భావాన్ని తెలియజేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Tags

Next Story