Ram Charan : రెహమాన్ కోరడంతో కడప దర్గాకు అయ్యప్ప మాలలో వెళ్లిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప విమానాశ్రయం వద్ద అభిమానులు, జనసేన నేతలు సందడి చేసి, రామ్ చరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వాహనంలో బయలుదేరి కడప నగరంలోని విజయదుర్గ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ బుచ్చి బాబు డైరెక్షన్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ సినిమా స్క్రిప్ట్ ను అమ్మ వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరుగా కడప పెద్ద దర్గాకు చేరుకున్నారు. పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. దర్గా విశిష్టతను పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ముషాయిర కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. 12 ఏళ్ళక్రితం కడప పెద్ద దర్గాకు వచ్చానన్నారు. మగథీర సినిమా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇక్కడికి వచ్చానని.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసని గుర్తు చేశారు. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిదిని, చాలా అదృష్టం కలిగిన దర్గా అంటూ చెప్పుకొచ్చారు. నాన్న చిరంజీవి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని, దర్గాకు రావడానికి ముఖ్య కారణం ఉందని ఆయన తెలిపారు. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని ఆ సందర్భంలో ఏఆర్ రెహమాన్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయని ఆ ఉత్సవాలకు కచ్చితంగా దర్గాకు వెళ్ళాలని అడిగారు. మూడు నెలలక్రితం రెహమాన్ తనను దర్గాకు వెళ్ళమని చెప్పారని రామ్ చరణ్ గుర్తుచేశారు. అందుకోసమే ఇక్కడకు వచ్చానని, అయ్యప్పమాలలో ఉన్నా ఇచ్చిన మాట కోసం దర్గాకు వచ్చానని స్పష్టం చేశారు. తనకు అయ్యప్పస్వామి ఆశీస్సులతో పాటు ఆ అల్లా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com