Salaar: సలార్ కొత్త అప్డేట్.. శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్..

Salaar: సలార్ కొత్త అప్డేట్.. శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Salaar: శృతి చేతిలో ప్రస్తుతం అన్ని పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి. అందులో ఉన్న ఒకేఒక్క పాన్ ఇండియా చిత్రం ‘సలార్’.

Salaar: ప్రభాస్ ప్రస్తుతం కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్తున్నాడు. అందులోనూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్. ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా.. వాటిని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా తన పాన్ ఇండియా సినిమాల్లోని ఒకటైన 'సలార్' గురించి ఓ అప్డేట్ బయటికొచ్చింది.

సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండి.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది శృతి హాసన్. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి స్పీడ్‌కు బ్రేకుల్లేవు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. తాను పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా. ఎవరితో సినిమా చేసినా శృతికి హిట్ గ్యారెంటీ అనిపిస్తోంది. శృతి కెరీర్‌లో మొదటిసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జోడీకడుతున్న చిత్రం 'సలార్'.

'కేజీఎఫ్' చిత్రంతో ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా మార్కెట్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన క్రెడిట్ ప్రశాంత్ నీల్‌దే. అందుకే ప్రభాస్‌తో సలార్ అనే మరో పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇందులో ప్రభాస్‌తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది శృతి హాసన్.

శృతి చేతిలో ప్రస్తుతం అన్ని పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి. అందులో ఉన్న ఒకేఒక్క పాన్ ఇండియా చిత్రం 'సలార్'. ఇందులో ప్రభాస్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండగా శృతి జర్నలిస్ట్‌గా కనిపించనుందని సమాచారం. అయితే తన పుట్టినరోజు సందర్భంగా సలార్ నుండి శృతి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో తాను ఆద్య అనే పాత్రలో కనిపించనుంది.


Tags

Read MoreRead Less
Next Story