Shyam Benegal: దివికేగిన వెండితెర శిఖరం "శ్యామ్ బెనగల్"

ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు... శ్యామ్ బెనెగల్(90) కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన.. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపైనా తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.38 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్యామ్ బెనెగల్ 1934 డిసెంబరు 14న హైదరాబాద్‌లో జన్మించారు.
సమాజంలోని పాత్రలే హీరోలు
కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో... ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా... జీవితాలను.. సమాజంలోని పాత్రలను వాస్తవికంగా తెరపై ఆవిష్కరించిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్. శ్యామ్ బెనెగల్ అసలు పేరు బెనెగెళ్ల శ్యామ్‌రావు. తెలంగాణ నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం.. దేశస్థాయికి.. అ తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన ఈ పక్కా హైదరాబాదీ...1934 డిసెంబరు 14న హైదరాబాద్ రాష్ట్రంలోని తిరుమలగిరిలో జన్మించారు. మెహబూబియా హై స్కూల్‌లో స్కూలింగ్.. సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదివిన బెనగల్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై విపరీతమైన ఇష్టంతో ఉన్న శ్యామ్ బెనగల్... యాడ్స్, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టి .. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఎనలేని ఖ్యాతి గడించారు. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీ ప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్‌లు అతి కష్టం మీద తెప్పించుకుని... సినిమా ప్రేమికుల కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారు. తెలిసిన జీవితాలు, చూసిన సినిమాలు శ్యామ్ బెనగళ్ ఆలోచనల్లో పారలల్ సినిమా ప్రపంచాన్ని సృష్టించాయి . ఇవే తర్వాత వెండితెరపై బెనగల్ చెరగని ముద్ర వేసేలా చేశాయి.
ప్రతీ సినిమా ఓ ప్రభంజనమే
తన కెరీర్లో శ్యామ్ బెనగల్ తీసింది 24 సినిమాలే. కానీ తీసిన ప్రతీ సినిమా.. ఓ సందేశమే. వెండితెరపై అద్భుతమే. సామాజిక సమస్యలు,ఆర్థిక అసమానతలపై ప్రత్యేకంగా సినిమాలు తెరకెక్కించిన శ్యామ్ బెనగల్ ను ఎన్నో అవార్డులు వరించాయి. సోషల్ మెసేజ్ చిత్రాలతో పాటు అనేక అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించారు శ్యామ్ బెనగల్. పద్మ విభూషణ్, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్ని అందుకున్నారు శ్యామ్ బెనగల్. వీటితో పాటు 18 సినిమాలకు జాతీయ పురస్కారాలను అందుకున్నారు శ్యామ్ బెనగల్. . జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగల్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డులను అందుకున్నారు. 2003లో ఇందిరిగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకున్నారు శ్యామ్ బెనగల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com