Dil Raju : పైరసీపై కఠిన చర్యలు .. ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు : దిల్ రాజు

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించామని, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తామని అయన వెల్లడించారు. ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్‌తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరం కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్బంగా కోరారు. ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్. ప్రియాంక మాట్లాడుతూ సినిమా జర్నలిస్టుల అక్రిడిటేషన్ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యలపై ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తప్పకుండా తాము కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com