Film Awards : జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమా...పలు విభాగాల్లో అవార్డులు..

Film Awards : జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమా...పలు విభాగాల్లో అవార్డులు..
X

71 వ జాతీయ చలన చిత్ర అవార్డులను నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన పలు చిత్రాలతో పాటు, వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందించనున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందిస్తారు. కాగా 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా తన సత్తా చాటింది.

ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికయ్యింది. ఆడపిల్ల లేడీ పిల్ల లాగ ఉండొద్దు..పులిపిల్ల లా ఉండాలి అంటూ మహిళా సాధికారత కథ తో వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ యాసలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమాలో పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. పల్లె ఆప్యాయతలను, అనురాగాన్ని కళ్లకు కట్టేలా ఆయన రాసిన ఊరు పల్లెటూరు పాట జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇక యువత కు దగ్గరైన బేబీ సినిమా రెండు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్, బెస్ట్ మేల్ సింగర్ కేటగిరీలో రోహిత్ అవార్డు గెలుచుకున్నారు. చిన్నారులను అమితంగా ఆకట్టుకున్న హనుమాన్ రెండు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ అండ్ కామిక్), ఉత్తమ యాక్షన్ దర్శకత్వం విభాగాల్లో నందు పృధ్వీ సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు.ఇక ఉత్తమ బాల నటిగా గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన సుకృతి వేణి అవార్డు సాధించింది. కాగా సుకృతి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు కావడం విశేషం.

ఇక అవార్డులకు ఎంపిక అయిన వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకోవడం గర్వ కారణం ఆన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ను నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు అవార్డు విన్నర్ లకు అభినందనలు తెలిపారు.

Tags

Next Story