Actor Fish Venkat : ఫిష్ వెంకట్ మృతి.. ప్రముఖుల సంతాపం

Actor Fish Venkat : ఫిష్ వెంకట్ మృతి.. ప్రముఖుల సంతాపం
X

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం ప్రాణాలు విడిచారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఐతే కిడ్నీలు మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో దాతలు ఎవరైనా సాయం చేయాలని వెంకట్ కుమార్తె కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కన్ను మూయడం తో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల తో పాటు ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు ఫిష్ వెంకట్. తెలంగాణ స్టైల్ లో డైలాగు లు చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్ వంటి అనేక హిట్ చిత్రాలలో నటించి అందరి మెప్పు పొందారు. 2002 లో వచ్చిన ఆది సినిమా వెంకట్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా వల్లే తాను ఇండస్ట్రీ లో నిలదొక్కుకోగలిగానని , వివి వినాయక్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని అనేక ఇంటర్వ్యూ లలో ఫిష్ వెంకట్ చెప్పారు.

కాగా ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. ముషీరాబాద్ లో ఒక సాదా సీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకటేశ్ ఇండస్ట్రీ కి వచ్చి ఫిష్ వెంకట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫిష్ వెంకట్ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు పలువురు నటులు..ఈ మేరకు డైరెక్టర్ హరీశ్ శంకర్ మిస్ యూ అన్న అని పోస్ట్ చేశారు.

Tags

Next Story