ఫ్లాప్ డైరెక్టర్స్ తో టాప్ హీరోలు

ప్రతి స్టార్ హీరో ప్యాన్ ఇండియా సినిమా టార్గెట్ గానే దూసుకుపోతున్నారిప్పుడు. అయితే కొందరు టాప్ హీరోలు తమ నెక్ట్స్ మూవీస్ ను ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేయబోతుంటం విశేషం. అంటే ఇవాళ కంటెంట్ బలంగా ఉంటే నిన్నటి డిజాస్టర్స్ తో పనిలేదు అనుకుంటున్నట్టుగానే భావించాలి.
లేటెస్ట్ గా కల్కితో మరోసారి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ మూవీ దర్శకుడు మారుతితో చేస్తున్నాడు. మారుతి చివరి సినిమాలైన మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా ప్రభాస్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. వీరి కాంబోలో ఇప్పుడు రాజా సాబ్ రూపొందుతోంది. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కాస్త హారర్ కంటెంట్ కూడా ఉంటుందని చెప్పారు. నిధిఅగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజా సాబ్ రిజల్ట్ తేడా కొడితే ప్రభాస్ కు ఏం కాదు కానీ.. మారుతికే హ్యాట్రిక్ ఫ్లాపులు పడతాయి.
ఆర్ఆర్ఆర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ దేవర దర్శకుడు కొరటాల శివ చివరి సినిమా ఆచార్య ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్ట్ లో ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ వంటి క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమాతోనే అంత పెద్ద డిజాస్టర్ చూసిన అతను ఇప్పుడు ఎన్టీఆర్ కు ఏకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు. మరి ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనేది సెప్టెంబర్ 27న తేలిపోతుంది.
రామ్ చరణ్ కూడా ఇదే సిట్యుయేషన్ లో ఉన్నాడు. ఆల్రెడీ అతను కొరటాల వల్ల ఆచార్య బాధితుడుగా ఉన్నాడు. ఇప్పుడు శంకర్ తో చేస్తోన్న గేమ్ ఛేంజర్ పై ఎవరికీ నమ్మకాల్లేవు. అందుకు కారణం భారతీయుడు 2 రిజల్ట్. ఈ మూవీ ఇంత దారుణమైన డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కమల్ వంటి టాప్ స్టార్ నటించిన సినిమాకు కొన్ని చోట్ల జనం లేరని షోస్ నే నిలిపేస్తున్నారంటే శంకర్ మైండ్ సెట్ ఎక్కడ ఆగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద ఫ్లాప్ ఇచ్చిన శంకర్ ఇక రామ్ చరణ్ కు హిట్ ఇవ్వడు అని ఫ్యాన్స్ ఫీలయితే ఆశ్చర్యం ఏముందీ..?
తమిళ్ టాప్ స్టార్ విజయ్ కూడా ఇదే సిట్యుయేషన్ లో ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ తో చేసిన లియోకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందా మూవీ. అతనిప్పుడు వెంకట్ ప్రభుతో ‘గోట్’ అనే సినిమా చేస్తున్నాడు. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. వెంకట్ ప్రభు ఫస్ట్ టైమ్ తెలుగులో చేసిన కస్టడీ బిగ్ ఫ్లాప్. నాగ చైతన్య నటించిన ఈ మూవీతో అతను తమిళ్ లో కూడా ఫ్లాప్ చూశాడు.
విజయ్ దేవరకొండ కూడా ఇదే సిట్యుయేషన్ లో ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అతను చేస్తోన్న సినిమా ఈ యేడాదే విడుదల కాబోతోంది. అయితే గౌతమ్ జెర్సీ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అక్కడెవరూ పట్టించుకోలేదు. సో.. ఫ్లాప్ సినిమా తర్వాతే విజయ్ తో మూవీ చేస్తున్నాడు. మొత్తంగా ఈ హీరోల ఫ్యూచర్ ఏంటో కానీ.. ఫ్లాప్ డైరెక్టర్స్ చేతిలో వాళ్ల నెక్ట్స్ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com