Upasana Konidela : వారసత్వం, పెళ్లితో కాదు.. నా కష్టంతోనే గుర్తింపు తెచ్చుకున్నా

తాను ఎంచుకున్న రంగంలో ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి ఓ స్థాయికి చేరుకోవడం వల్లే గుర్తింపు దక్కిందని, ఇది కేవలం వారసత్వం లేదా పెళ్లి వల్ల రాలేదని ప్రముఖ వ్యాపారవేత్త, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. తన పనిపై కొన్నిసార్లు తనకు సందేహం కలిగేదని, నిరుత్సాహపడినప్పటికీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టానని ఆమె తెలిపారు.
ఓ వ్యక్తిని ఏది ప్రత్యేకంగా నిలుపుతుందనే అంశంపై ఉపాసన తన సోషల్ మీడియాలో 'ఖాస్ ఆద్మీ' పేరుతో ఒక స్ఫూర్తిదాయక పోస్టు చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె ‘‘నేను వారసత్వం లేదా పెళ్లి కారణంగా ప్రత్యేక వ్యక్తిని కాలేదు. ఒత్తిడిని, బాధను తట్టుకుని ఎదగడాన్ని ఎంచుకున్నాను. ఎన్నోసార్లు కిందపడ్డాను. మళ్లీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నాపై నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంటుంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు’’ అని అన్నారు.
ఉపాసన తన పోస్ట్‌ను 'ఖాస్ ఆద్మీ పార్టీ' అనే వినూత్న ఆలోచనతో ప్రారంభించారు. ఇది రాజకీయ పార్టీ కాదని, వ్యక్తిగత విలువలు, అంతర్గత శక్తి గురించి చెప్పే ఒక వేదిక అని ఆమె వివరించారు. సంపద, హోదా, విజయం కంటే ఒక వ్యక్తిలోని అంతర్గత లక్షణాలైన భావోద్వేగ స్పష్టత, ఇతరులకు సహాయం చేసే గుణం వంటివి అతడిని గొప్పవారిని చేస్తాయని ఉపాసన ప్రశ్నించారు. సమాజం తరచుగా బాహ్య విజయాలకే విలువ ఇస్తుందని, ముఖ్యంగా మహిళలు నిరాడంబరంగా ఉండాలని, పెద్ద కలలు కనడాన్ని ప్రోత్సహించదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘అహంకారం గుర్తింపును కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం నిశ్శబ్దంగా గుర్తింపును సృష్టిస్తుంది’’ అని ఉపాసన తన అభిప్రాయాలను పంచుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలిగా, ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె ఈ సందేశం చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని నెటిజన్లు ప్రశంసించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com