Vijay Deverakonda : డేటింగ్ రూమర్స్‌పై విజయ్ దేవరకొండ క్లారిటీ

డేటింగ్ రూమర్స్‌పై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని తాను చెబుతానని అన్నారు. తాను సెలబ్రిటీని కావడం వల్ల తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని.. దానిని తాను తప్పుగా భావించనని అన్నారు. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు విజయ్. ‘‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ.. వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే.. దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు.. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. ఈ రౌడీ హీరో గతకొంతకాలంగా హీరోయిన్ రష్మికతో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com