Ram Charan : రామ్ చరణ్ లో ఆ సత్తా ఉందా..?

Ram Charan  :  రామ్ చరణ్ లో ఆ సత్తా ఉందా..?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఆ సత్తా ఉందా..? ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ చూసిన తర్వాత చాలామందిలో వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. రామ్ చరణ్ లో ఆ సత్తా ఉంది.. కానీ గేమ్ ఛేంజర్ తో కాదు అనేది కొందరి అభిప్రాయం. బట్ ప్రస్తుతం ఉన్న లీగ్ చూస్తే ఖచ్చితంగా అతను టాప్ 3లోకి ఎంటర్ కావాల్సిందే అనేలా ఉంది అనేది నిజం. ఆ లీగ్ ఏంటీ.. కనీసం 500 కోట్ల క్లబ్ లో చేరాలి. ఈ క్లబ్ లో ఆల్రెడీ ప్రభాస్ ఎప్పుడో ఎంటర్ అయ్యాడు. అతనే ఐదు సినిమాలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ దేవరతో దాదాపు 500 కోట్ల వరకూ వచ్చాడు. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ చేరాడు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న చరణ్ కూడా ఈ క్లబ్ లోకి ఎంటర్ కావాల్సిందే. అది గేమ్ ఛేంజర్ తోనే మొదలు కావాలి అనేది కొందరి అభిప్రాయం.

నిజానికి గేమ్ ఛేంజర్ పై ఇప్పటి వరకూ ఎలాంటి అంచనాలూ లేవు. అంచనాలు క్రియేట్ అయ్యేలా మూవీ టీమ్ ఏ దశలోనూ ప్రయత్నించలేదు అనేది ఒప్పుకుని తీరాల్సిన విషయం. భారీగా ప్లాన్ చేసి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో టీజర్ రిలీజ్ చేశారు. బట్ ఆ తర్వాత పుష్ప పట్నా ఈవెంట్ తో కంపేర్ చేసి ఇది తుస్సుమంది అనేశారు చాలామంది. నిజానికి పుష్ప 2తో కంపేర్ చేయకపోయినా లక్నో ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అనేది అందరికీ తెలుసు. అంతకు ముందు రిలీజ్ అయిన పాటలు పెద్దగా ఎక్కలేదు. తర్వాత వచ్చిన నానా హైరానా సాంగ్ సైతం ఆకట్టుకోలేదు. యూ ట్యూబ్ లో ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయనే ప్రెస్ నోట్స్ వస్తున్నాయి తప్ప ఆ రేంజ్ లో ఆ పాటకు స్పందన లేదు అనేదీ తెలుస్తూనే ఉంది. ఇక మిగిలింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఇది ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు కానీ.. ఈ నెల 21న యూఎస్ టెక్సాస్ లో ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. అక్కడ ట్రైలర్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే మెయిన్ మార్కెట్ అయిన ఇండియాలో ఇంకా బజ్ క్రియేట్ కాలేదు. కానీ ఓవర్శీస్ వైపు వెళ్లడం వెనక ప్లానింగ్ ఏంటో కానీ.. ఓవర్శీస్ లో అంత క్రౌడ్ వచ్చినా.. ఇక్కడి ఆడియన్స్ కు పెద్దగా కిక్ ఇవ్వదు అనేది వాస్తవం. ఇక జనవరి 4న పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాజమండ్రిలో అత్యంత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు డబుల్ అవుతాయేమో కానీ.. ఈ మూవీతో రామ్ చరణ్ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సరసన చేరతాడా అనేది చెప్పలేం.

గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ ఫామ్ కోల్పోయి చాలా కాలం అవుతోంది. అతనికి తెలుగు ఆడియన్స్ పల్స్ తెలియవు అనే అనుకోవాలి. పైగా రీసెంట్ గా వచ్చిన అతని భారతీయుడు 2 ఆల్ టైమ్ కోలీవుడ్ డిజాస్టర్స్ లో చేరింది. ఇటు ఈ మూవీ తారాగణం సైతం రెగ్యులర్ గానే కనిపిస్తోంది. కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, జగపతిబాబు, సునిల్, ప్రకాష్ రాజ్ వంటివాళ్లు ఉన్నారు. రామ్ చరణ్ కాకుండా వీరి కోసం థియేటర్స్ కు వస్తారు అని చెప్పేందుకే ఇంకే ఎసెట్ కనిపించడం లేదు. ఇక తమన్ సంగీతం సరేసరి. ఇన్ని మైనస్ లను దాటుకుని.. గేమ్ ఛేంజర్ 500 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది అంటే అది ఖచ్చితంగా రామ్ చరణ్ మెగా పవర్ వల్లే అవుతుంది.. ఆ తర్వాత కంటెంట్ కు స్థానం దక్కుతుంది.

Tags

Next Story