HBD GANGULY: హ్యాపీ బర్త్ డే దాదా..సిక్సర్లకి కేరాఫ్ అడ్రస్..!

సౌరవ్ గంగూలీ... టీమిండియాకు దూకుడు నేర్పిన లెజెండరీ కెప్టెన్.. సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, ప్రపంచ క్రికెట్లో టీమిండియా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన రథసారథి. భారత క్రికెట్ రూపురేకలను పూర్తిగా మార్చేసిన గొప్ప కెప్టెన్.. సౌరవ్ గంగూలీ. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా.. టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అత్యుత్తమ ఘనత సాధించిన సౌరవ్ గంగూలీ తన 50వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. కానీ తన తోటి ప్లేయర్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అశేష అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు దాదా. స్వదేశంలోనే భారత్ విజయం సాధించగలదనే అపకీర్తిని చెరిపేస్తూ విదేశీ గడ్డపైనా భారత్ జట్టు సత్తాచాటగలదని నిరూపించిన తొలి కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలవగానే స్టేడియంలోని బాల్కనీలో షర్ట్ విప్పి.. దాన్ని గిరగిరా తిప్పడం ద్వారా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి దాదా చాటాడు. ఏ ప్లేయర్‌కి ఎంత వరకూ సపోర్ట్ ఇవ్వాలి..? ఏ స్థానంలో బ్యాటింగ్ చేయించాలి..? ఇలా అన్నింటిలోనూ గంగూలీ మార్క్ కనబడేది. ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు తమ నోటి దురుసుతో స్లెడ్జింగ్‌కి దిగుతుంటే భారత క్రికెటర్లు మౌనంగా ఊరుకుండే రోజులకు స్వస్తి చెప్పండం నేర్పింది దాదానే. గంగూలీ కెప్టెన్సీలోనే దూకుడుగా బదులు ఇవ్వడం ప్లేయర్స్ కు అలవాటయింది.
సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో ఎందరో ప్రతిభకల ప్లేయర్స్ కు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్లకి వెన్నంటే ఉండి వారిని మేటి ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు. కెరీర్ ప్రారంభంలో గంగూలీ తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆటగాళ్లకు డ్రింక్స్ అందించనని, అది తన ఉద్యోగం కాదని సీనియర్ ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో తెగేసి చెప్పాడు. దీంతో గంగూలీని జట్టులోంచి తీసివేయాల్సి వచ్చింది. అయితే మళ్లీ రంజీల్లో తనదైన శైలిలో అదరగొట్టి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడి నుంచి ఇక గంగూలీకి తిరుగేలేదు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలకంపై 158 బంతుల్లో 183 పరుగులు చేసిన ఇన్నింగ్స్ గంగూలీ అభిమానుల మదిలో ఇంకా కదలాడుతోంది.
వ్యక్తిగత రికార్డులు:
2000-2003 మధ్య కాలంలో అత్యధిక పరుగులు చేసిన గంగూలీ కేవలం 73 మ్యాచ్‌లలో 79.04 స్ట్రైక్ రేట్‌తో 3,346 పరుగులు సాధించాడు. ఈ కాలంలో అతని బ్యాటింగ్ సగటు 50.69. కనీసం 35 మ్యాచ్‌లు ఆడిన అన్ని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల కంటే గంగూలీ బ్యాటింగ్ యావరేజ్ అధికం కావడం విశేషం. ఆనాటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లైన సయీద్ అన్వర్,నాథన్ ఆస్టెల్, హెర్షెల్ గిబ్స్, రికీ పాంటింగ్, మార్క్ వా, ఇంజామామ్-ఉల్-హక్ వంటి వారి స్ట్రైక్ రేట్ కంటే గంగూలీ స్ట్రైక్ రేట్ (79.04) ఎక్కువ కావడం గమనించదగ్గ అంశం.
రోహిత్ శర్మ తర్వాత ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు (3) చేసిన భారత బ్యాట్స్‌మన్ గంగూలీనే. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్‌లో అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ 131 పరుగులు చేశాడు. 2003 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కెన్యాపై 111 పరుగులతో, గంగూలీ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు అయ్యాడు.
1999 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై 183 పరుగులు చేసి 16 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అదే ఇన్నింగ్స్‌లో అతను రాహుల్ ద్రావిడ్‌తో కలిసి వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరు సాధించిన 318 పరుగులు రెండు వికెట్‌కు మూడో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.
భారత్ తరఫున లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా గంగూలీ టెస్టులు, వన్డే రెండింటిలోనూ అత్యధిక పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండర్‌గా 113 టెస్టులలో 7,212 పరుగులు చెయ్యగా,311 వన్డేలాడి 11,221 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా కొనసాగుతున్నాడు.
ప్రపంచ క్రికెట్లో టీమిండియాకు దూకుడు నేర్పి భారత క్రికెట్ రూపురేకలను సమూలంగా మార్చేసిన మాజీ రథసారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే దాదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com