సీన్ రివర్స్.. తడబడిన టీమిండియా

సీన్ రివర్స్ అయింది.. టెస్టుల్లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో తడబాటు పడింది.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ టీమ్ రెండు వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది.. దీంతో టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది ఇంగ్లండ్ జట్టు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.. ఓపెనర్లు, మిడిలార్డర్ తేడా లేకుండా అంతా విఫలమయ్యారు.. ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధవన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.. వరుస ఓవర్లలో ఇద్దరూ అవుటవడం టీమ్‌పై ఒత్తిడి మరింత పెంచింది.. ఆ తర్వాత రిషబ్ పంత్ మెరుపులు మెరిపించినా స్టోక్స్ వేసిన స్లోబాల్‌కు అవుటయ్యాడు.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత బంతికే శార్దూల్ ఠాకూర్ డకవుట్ అయ్యాడు. దీంతో 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.. మొత్తంగా శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 20 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో రాణించగా, రషీద్, మార్క్ ఉడ్, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.
ఇక భారత్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 15.3 ఓవర్లో ఛేదించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ 49 పరుగులు, జోస్ బట్లర్ 28 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత బట్లర్ అవుటవగా, రాయ్ బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో డేవిడ్ మలాన్, జానీ బెయిర్టో మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ మరో 27 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com