India Vs England.. భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు.. ఈ మ్యాచ్ వాళ్లకి ఎంతో కీలకం!

India Vs England.. మొతెరా వేదికగా ఇవాళ్టి నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్షా పది వేల మందికి సామర్థ్యమున్న ఈ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెండు టీమ్స్ పోటీపడనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి ఇరు జట్లు. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే.. రెండో టెస్టులో అందుకు ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇక మూడో టెస్ట్‌లోనూ పట్టుసాధించి.. సిరీస్‌లో సేఫ్‌జోన్‌లో నిలవాలని భావిస్తోంది కోహ్లీసేన. అటు అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు.
స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా నిలవడానికి కోహ్లీ మరో విజయం దూరంలో మాత్రమే నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. 37 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 7500 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. భారత్ తరఫున 400 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలవడానికి రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు దూరంలో ఉన్నాడు. ఆ ఘనత సాధిస్తే ప్రపంచ క్రికెట్‌లో 400 వికెట్లు మార్క్‌ను అందుకున్న 16వ బౌలర్‌గా యాష్ నిలుస్తాడు. ఇక టెస్టుల్లో 2500 పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్ శర్మకు మరో 25 పరుగులు అవసరం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com