టీంఇండియా మా రికార్డు బద్దలు కొట్టింది.. భారత్ ఓటమి పై అక్తర్ ఏమన్నాడంటే..

Shoaib Akhtar ( File Photo)
ఆసీస్ తో జరిగిన తోలి టెస్టులో భారత జట్టు ఘోరమైన ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది. అయితే భారత ఓటమి పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన యౌట్యుబ్ లో మాట్లాడుతూ టీంఇండియా పైన వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. " నేను నిన్న రాత్రి మ్యాచ్ చూడలేకపోయాను. ఈ రోజు ఉదయం మేల్కొని టీవీ ఆన్ చేసాను. అందులో స్కోర్ బోర్డులో 369 ఉన్నట్టుగా కనిపించింది.
అప్పుడు నేను నా కళ్ళను నులుముకుని జాగ్రత్తగా చూడగా, 36/9 అని ఉంది. అందులో ఒకరు రిటైర్డ్. ఇది పూడ్చలేని నష్టం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారత బ్యాటింగ్ ఇలా కుప్ప కూలిపోయింది. ఏది ఏమైనా భారత్ మా రికార్డును బ్రేక్ చేసింది. అయినప్పటికి ఆటలో ఇవన్నీ సహజమే ఇలాంటి ప్రదర్శన ఇచ్చినప్పుడు బాణాల్లా దూసుకువచ్చే విమర్శలను ఎదురుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలి" అని అక్తర్ అన్నాడు. కాగా గతంలో 2013లో జోహన్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో పాకిస్తాన్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కేవలం 49 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి విమర్శలపాలైంది.
ఇక ఇదిలా ఉంటే మూడోరోజు ఆటలో 21.2 ఓవర్లు ఆడిన టీంఇండియా తొమ్మిది వికెట్లను కోల్పోయింది. దీనితో 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కి విజయం నల్లేరు పై నడకలాగా సాగింది. ఈ విజయంతో సిరీస్ లో ఆసీస్ 1-0 తో ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఇంత తక్కువ స్కోర్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com