Bhadradri Kothagudem: 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. మృతురాలు 3 నెలల గర్భవతి..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. మడకం ఇర్భమ్మ అనే విద్యార్థిని పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 3 నెలల గర్భిణిగా తేలడంతో తల్లిదండ్రులు మందలించారని, దీంతో మనస్తాపానికి గురైన బాలిక సూసైడ్ చేసుకుందనే సంఘటన సంచలనం రేపుతోంది.
విద్యార్థిని గర్భం దాల్చడంపై ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు, ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచటంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టరీగా మారిన విద్యార్థిని ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మడకం ఇర్భమ్మ.. పదో తరగతి చదువుతోంది. త్వరలో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే బాలికను పాఠశాల నిర్వాహకులు ఇంటికి పంపించారు.
అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. మడకం ఇర్భమ్మ గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో విద్యార్థినిని తల్లిదండ్రులు మందలించారు. విద్యార్థిని గర్భం దాల్చడంపై ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు, ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచటంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com