ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి.. యువకుడి ఇంటికి నిప్పుపెట్టిన యువతి బంధువులు

ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి.. యువకుడి ఇంటికి నిప్పుపెట్టిన యువతి బంధువులు

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళల, బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదులు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. యువతులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులపై పాశవికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది.

పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, పూతలపట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు.. డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు. గత నెలలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దీనిపై గాయత్రి తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమ జంటను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో గాయత్రి.. తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటానని చెప్పడంతో చేసేదేమీ లేక పోలీసులు వారిద్దర్నీ తిరిగి తమ ఇళ్లకు పంపించారు. అయితే కక్ష పెంచుకున్న ఢిల్లీ బాబు.. బైక్‌పై ఇంటికి వెళ్తున్న గాయత్రిని తన బంధువు అమ్మాయితో కలిసి దారి కాసి అడ్డగించాడు. తీవ్ర కోపంతో విచక్షణ కోల్పోయి... కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గాయత్రి కుటుంబ సభ్యులు... ఆమెను హుటాహుటిన పెనుమూరు పీహెచ్‌సీకి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా దారిలోనే గాయత్రి మృతి చెందింది.

గాయత్రి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చింతమాకులపల్లిలోని ఢిల్లీబాబు ఇంటిపై దాడి చేసి బైక్‌ను తగులబెట్టారు. దీంతో చింతమాకులపల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పరారీలో ఉన్న ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీబాబు కుటుంబంపై గాయత్రి బంధువులు దాడి చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మరోవైపు తమ కూతురుకి న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేదిలేదని గాయత్రి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story